పదిలో బార్డర్ మార్కులు.. ఇంగ్లీష్‌ 35, మ్యాథ్స్ 36, సైన్స్ 38.. వైరల్ అవుతోన్న ఐఏఎస్ స్టోరీ

గుజ‌రాత్‌లోని బహ్రూచ్ క‌లెక్ట‌ర్‌గా విధులు నిర్వ‌ర్తిస్తున్న తుషార్ సుమేరా టెన్త్ మెమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టెన్త్ ప‌బ్లిక్ ఎగ్జామ్‌లో ఆయ‌న బోర్డ‌ర్ మార్కుల‌తో గెట్టెక్కాడు. ఇంగ్లీష్‌ 35, గ‌ణితం 36, సైన్స్ లో 38 మార్కులు మాత్ర‌మే సాధించాడు. కానీ చివ‌ర‌కు ఎవ‌రూ ఊహించ‌ని విధంగా ఐఏఎస్ ఆఫీస‌ర్‌గా కొలువు సాధించి.. ప్ర‌శంస‌లు అందుకున్నాడు.

సుమేరా క‌ష్ట‌ప‌డి జీవితంలో ఎదిగారు. 2012లో ఐఏఎస్ సాధించారు. ఐఏఎస్ ఉద్యోగం సాధించే కంటే ముందు టీచ‌ర్‌గా ప‌ని చేశారు. డిగ్రీలో ఆర్ట్స్ గ్రూపు చ‌దివారు. ఆయ‌న‌లాంటి బ్యాక్ బెంచ్ విద్యార్థులు.. బోర్డ‌ర్ మార్కుల‌తో పాస‌య్యే వారికి ఆయ‌న‌ స్టోరీ ప్రేర‌ణ‌గా నిల‌వాల‌నే ఉద్దేశంతో.. ఆ ఐఏఎస్ ఆఫీస‌ర్ టెన్త్ మెమోను మ‌రో ఐఏఎస్ ట్విట్ట‌ర్‌లో షేర్ చేయడంతో సుమేరా స్టోరీ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

ఛ‌త్తీస్‌గ‌ఢ్ క్యాడ‌ర్‌కు(2009 బ్యాచ్‌) చెందిన ఐఏఎస్ ఆఫీస‌ర్ ఆవ‌నీష్ శ‌ర‌ణ్‌.. తుషార్ సుమేరా టెన్త్ మెమోను ట్విట్ట‌ర్‌లో షేర్ చేశారు. టెన్త్ లో సుమేరా మెమోతో పాటు ఆ ఆఫీస‌ర్ ఫోటోను షేర్ చేశారు. ఇప్పుడు ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థులు త‌మ ఫ‌లితాల కోసం ఎదురుచూస్తున్నారని, త‌క్కువ‌గా మార్కులొచ్చాయ‌ని బాధ‌ప‌డే విద్యార్థుల‌కు.. ఐఏఎస్ సుమేరా స్టోరీ ప్రేర‌ణ‌గా నిలుస్తోంద‌ని ఆవ‌నీష్ శ‌ర‌ణ్ తన ట్వీట్ లో చెప్పుకొచ్చారు.