ధరలు ఇలా పెరిగితే.. కనీసం కూరగాయలు కొనగలమా?

ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో నిత్యావసరాల ధరలు కూడా ఆకాశన్నంటుతున్నాయి. తద్వారా సామాన్యుడు ఏది కొనాలన్నా ఒకటికి పదిసార్లు ఆలోచిస్తున్నాడు. అయినా దేశ ప్రజల ఇబ్బందులు కేంద్రానికి పట్టడం లేదు. హిట్లర్ పాలన మాదిరిగా నియంతృత్వ పాలన కొనసాగిస్తున్నారు. తాజాగా సీఎన్జీ ధరలు కిలోకు రూ. 2 పెరిగాయి.

అంతకుముందు, ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ మే 15న కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ ధరను కిలోకు రూ. 2 పెంచింది. గత ఏడాది అక్టోబరు నుంచి దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగా గ్యాస్ ధరలు పెరగడం మొదలైనప్పటి నుంచి సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లు ఎప్పటికప్పుడు ధరలను పెంచుతూనే ఉన్నారు. పెరుగుతున్న సీఎన్జీ ధరల వల్ల తమ జీవితాలు ఎలా ముందుకెళ్తాయని ఆటో డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ ఆదాయంలో ఎక్కువ భాగం వాహనానికే ఖర్చు పెట్టాల్సి వస్తోందని వాపోతున్నారు.

‘సీఎన్జీ ధరల పెరుగుదల మా జీవితాలను ప్రభావితం చేస్తోంది. ఇంధన ధరతో పోలిస్తే మా ఆదాయం మొత్తం ఆటోలో ఇంధనం నింపడానికే ఉపయోగిస్తున్నాం. కస్టమర్లను ఎక్కువ చార్జీ చేస్తే వారు ఇవ్వరు. ఇలా అయితే మేం ఏం తిని బతకాలి? ఏం సంపాదించి మా కుటుంబాలను పోషించాలి? ధరల పెరుగుదల ఇలా ఉంటే కనీసం కూరగాయలు కూడా కొనగలమా? ధరల పెంపుతో మా ఆటో ధరలు పెంచితే.. ప్రయాణికులు బస్సులు ఎక్కుతున్నారు’అని ఓ ఆటో డ్రైవర్ తన బాధను వెల్లగక్కాడు.