వరుసగా నాలుగో రోజూ 3 లక్షల కరోనా కేసులు.. పెరిగిన మరణాలు

India adds 3.33 lakh new cases, 525 deaths reported in last 24 hours

దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజురోజుకూ పెరుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా రోజువారి కేసుల సంఖ్య మూడు లక్షలకుపైగా నమోదవుతున్నాయి. నిన్నటితో పోలిస్తే కాస్త కేసులు తగ్గినా.. 3లక్షలపైగా కొత్త రికార్డవగా.. 500పైగా మరణాలు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 3,33,533 మంది కరోనా నిర్ధారణ అయ్యిందని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది.

మహమ్మారి కారణంగా నిన్న 525 మంది మరణించారు. కాగా.. శుక్రవారంతో పోల్చుకుంటే..4,171 పాజిటివ్ కేసులు తగ్గాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ ఆదివారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. కాగా.. దేశంలో పాజిటివిటి రేటు గణనీయంగా పెరుగుతోంది. రోజూవారి పాజిటివిటీ రేటు 17.782% శాతం ఉన్నట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 21,87,205 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా నిన్న కరోనా నుంచి 2,59,168 మంది బాధితులు కోలుకున్నారు.

మరోవైపు శనివారం దేశవ్యాప్తంగా 71.10 లక్షల మంది కరోనా టీకా వేయించుకున్నారు. ఇప్పటి వరకు 1,61,92,84,270 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 15 నుంచి 18 ఏళ్ల మధ్య వయస్సువారిలో 4,15,77,103 మందికిపైగా టీకా తొలి డోసు తీసుకున్నారు. అలాగే మొత్తం 80,10,256 మందికి ప్రికాషనరీ డోసులు పంపిణీ చేశారు.