ఐదో టీ20 వర్షార్పణం.. సిరీస్‌ సమం

భారత్‌, దక్షిణాఫ్రికా సిరీస్‌ సమమైంది. వర్షం కారణంగా నిర్ణయాత్మక ఐదో టీ20ని రద్దు అయింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి రెండు టీ20ల్లో దక్షిణాఫ్రికా విజయం సాధించగా.. మిగిలిర రెండు మ్యాచ్‌ల్లో భారత్‌ గెలుపొందిన విషయం తెలిసిందే.

ఐదో మ్యాచ్‌లో టాస్‌ ఓడిన భారత్‌ మొదట బ్యాటింగ్‌కు దిగింది. వర్షం కారణంగా 50 నిమిషాల ఆలస్యంగా ప్రారంభమైన ఈ మ్యాచ్.. 3.3 ఓవర్లపాటు సాగింది. ఇషాన్‌ కిషన్‌ (15), రుతురాజ్‌ గైక్వాడ్‌ (10) ఎక్కువ సేపు క్రీజ్ లో నిలువలేకపోయారు. సఫారీ బౌలర్లలో ఎంగ్డీ రెండు వికెట్లు పడగొట్టాడు.

టీమిండియా 2 వికెట్ల నష్టానికి 28 పరుగులు చేసిన సమయంలో మరోసారి వర్షం పడింది. ఆ తర్వాత ఏ దశలోనూ వర్షం ఆగకపోవడంతో పలుమార్లు సమీక్షలు నిర్వహించిన అంపైర్లు చివరకు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. నాలుగు మ్యాచ్‌ల్లో పొదుపుగా బౌలింగ్‌ చేసి 6 వికెట్లు పడగొట్టిన భారత పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌’అవార్డు దక్కింది.