ఈ ఉదయం భారత్‌, న్యూజిలాండ్‌ తొలి టెస్టు మ్యాచ్

న్యూజిలాండ్​తో జరిగిన టీ20 సిరీస్ ను క్లీన్​స్వీప్ చేసిన టీమ్ఇండియా.. ఇప్పుడు టెస్ట్ మ్యాచ్ లో కూడా అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైంది. కోహ్లీ, రోహిత్‌, రాహుల్‌, పంత్‌, బుమ్రా, షమీ వంటి స్టార్‌ ఆటగాళ్లు అందుబాటులో లేకున్నా.. పరిమిత వనరులతోనే అద్భుతం చేయాలని రహానే సేన చూస్తుంటే.. ముగ్గురు స్పిన్నర్ల వ్యూహంతో భారత్‌ను దెబ్బ కొట్టాలని విలియమ్సన్‌ గ్యాంగ్‌ భావిస్తున్నది. రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా గురువారం నుంచి ఇక్కడి గ్రీన్‌ పార్క్‌ స్టేడియంలో తొలి పోరు ఈ ఉదయం 9:30 గం.లకు ప్రారంభం కానుంది.

ప్రస్తుత జట్టులో రహానే, పుజారా, మయాంక్ అగర్వాల్‌ , శుభ్‌మన్ గిల్‌ వంటి మంచి ఆటగాళ్లు ఉన్నారు. వారు మంచి ప్రదర్శన చేస్తే రెగ్యులర్‌ ఓపెనర్లు జట్టులోకి వచ్చినప్పుడు అవసరమైతే వారిని మిడిల్ ఆర్డర్‌లోనైనా సర్ధుబాటు చేసే అవకాశం ఉంటుందని కోచ్ ద్రవిడ్‌ ఆశిస్తున్నాడు. గత 11 టెస్టుల్లో కేవలం 19 సగటుతో మాత్రమే పరుగులు చేసిన రహానే జట్టులో కొనసాగాలంటే కెప్టెన్‌గానే కాకుండా తనను తాను నిరూపించుకోవాల్సి ఉంది. టిమ్‌ సౌథీ, నీల్ వాగ్నర్‌ల బౌలింగ్‌ దాడిని ఎదుర్కొని నిలిస్తేనే రహానే భారీ స్కోరు సాధించే అవకాశముంది.

న్యూజిలాండ్‌ ప్రధానబలం వారి కెప్టెన్ కేన్‌ విలయమ్సనే. టీ20 సిరీస్‌కు విశ్రాంతి తీసుకున్న కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ తిరిగి జట్టుతో చేరడం బ్లాక్‌ క్యాప్స్‌కు కొండంత అండ కాగా.. అజాజ్‌ పటేల్‌, సోమర్‌విల్లే, శాంట్నర్‌ రూపంలో ఆ జట్టుకు సరిపడ స్పిన్‌ వనరులు అందుబాటులో ఉన్నాయి. మరి భారత ఆటగాళ్లు బదులు తీర్చుకుంటారా.. లేక బ్లాక్‌క్యాప్స్‌ విజృంభిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.