బ్రిటన్ ప్రధానిగా భారతీయుడు..!

Boris-Johnson-replaced-with Rishi Sunak

బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ పదవిలో ఉన్న యాభై ఏడేళ్ళ బోరిస్‌ జాన్సన్‌కు పదవీ గండం పొంచి వుందని, ఆయన వైదొలిగితే ఆపదవికి భారతీయ సంతతి వ్యక్తే అర్హుడని బ్రిటన్ మీడియా విశ్లేషిస్తోంది. ఈ విషయంలో ఏకంగా ఆన్‌లైన్‌లో బెట్టింగులు కూడా జోరుగా సాగుతున్నాయి.

ఏడాదిన్నర క్రితం దేశాన్ని కోవిడ్‌ కుదిపేస్తున్న సమయంలో బ్రిటన్ ప్రధాని నివాసం 10 డౌన్‌ స్ట్రీట్‌లో తన సహచరులతో కలిసి నిర్వహించిన లిక్కర్ పార్టీ జాన్సన్ పదవికి గండాన్ని తెచ్చి పెట్టింది. కరోనా కఠిన ఆంక్షలు అమల్లో ఉండగానే లిక్కర్ పార్టీ ఇవ్వడంపై ఇప్పుడు బ్రిటన్ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రతిపక్ష లేబర్‌ పార్టీయేగాక.. సొంత కన్జర్వేటివ్‌ పార్టీ నుంచి కూడా ఒత్తిడి పెరగడంతో జనవరి 13న బ్రిటన్ దిగువ సభ హౌస్‌ ఆఫ్‌ కామన్స్ లో క్షమాపణ చెప్పిన విషయం తెలిసిందే. అయినప్పటికీ జాన్సన్ పదవి నుంచి వైదొలగాలని డిమాండ్ చాలా బలంగా వినిపిస్తోంది. బోరిస్‌ సహా అధికార వర్గాల్లో లాక్‌డౌన్ నిబంధనల్ని ఉల్లంఘించినట్లు వస్తున్న వార్తలపై సూగ్రే అనే సీనియర్ సివిల్‌ సర్వెంట్‌ నేతృత్వంలో విచారణ కొనసాగుతోంది.

ఇదే సమయంలో జాన్సన్ తర్వాత ఎవరు బ్రిటన్ ప్రధాని పోస్టులో ఉంటారని స్థానిక మీడియాతోపాటు పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు తమ తమ విశ్లేషణలను ప్రచురిస్తున్నాయి. ఇందులో భారత సంతతికి చెందిన రిషి సునక్ పేరు బలంగా వినిపిస్తోంది. మనందరికీ సుపరిచితులైన ఇన్ఫోసిస్‌ నారాయణమూర్తికి రిషి స్వయానా అల్లుడు. రిషిప్రస్తుతం బ్రిటన్‌ ఫైనాన్స్ మినిస్టర్‌గా వ్యవహరిస్తున్నారు.

బెట్‌ఫెయిర్‌ అనే ఆన్‌లైన్‌ సంస్థ బెట్టింగ్‌ నిర్వహిస్తుంటుంది. బోరిస్‌ తప్పుకొంటే ప్రధాని రేసులో రిషి సునక్‌కు అత్యధిక మంది మద్దతు లభించే అవకాశం ఉన్నట్లు చెబుతోంది. విదేశాంగ సెక్రటరీ లిజ్ ట్రస్‌, క్యాబినెట్‌ మంత్రి మైకేల్‌ గోవ్‌ తర్వాతి స్థానంలో ఉన్నారు. విదేశాంగశాఖ మాజీ సెక్రటరీ జెరెమీ హంట్‌, భారత సంతతికి చెందిన హోం సెక్రటరీ ప్రీతి పటేల్‌, హెల్త్‌ సెక్రటరీ సజిద్‌ జావిద్‌, క్యాబినెట్‌ మంత్రి ఒలివర్‌ డోడెన్‌ పేర్లు కూడా బలంగా వినిపిస్తున్నాయి.

వివిధ బెట్టింగ్‌లను పోల్చి చూసే ఆడ్స్ చెకర్‌ సైతం బోరిస్ జాన్సన్ వారసుల రేసులో రిషి సునక్‌ అందరికంటే ముందంజలో ఉన్నట్లు తెలిపింది. ప్రతి పది మందిలో ఆరుగురు బోరిస్‌ జాన్సన్ తప్పుకోవాల్సిందేనని వాదిస్తున్నట్లు యూగవ్‌ అనే సంస్థ జరిపిన సర్వేలో తేలింది. బోరిస్‌ నిజాయతీగా సమాధానాలు ఇవ్వడం లేదని 78 శాతం మంది అభిప్రాయపడ్డారు. వీరిలో 63 శాతం మంది కన్జర్వేటివ్‌ పార్టీకి చెందిన వారు ఉండడం గమనార్హం.

సో.. అన్నీ అనుకున్నట్లు కొనసాగితే.. 2022 చివరి నాటికి బ్రిటన్ పరిపాలనా పగ్గాలు భారతీయ సంతితికి చెందిన రిషి సునక్‌ చేతికి అందే అవకాశాలున్నాయని అంతర్జాతీయ మీడియా విశ్లేషిస్తోంది. రెండు వందల సంవత్సరాలు పాలించిన బ్రిటిషర్ల రాజ్యానికి ఓ భారతీయ సంతతికి చెందిన వ్యక్తి అధినేత కావడంపై ప్రతి భారతీయుడు గర్వంగా ఫీలయ్యే అంశమే కదా.