భారత మహిళల హాకీ టీం 2-1 గోల్స్ తేడాతో అర్జెంటీనాపై విజయం

Indian women team

భారత మహిళల హాకీ జట్టు సంచలనం సృష్టించింది. అంతర్జాతీయ హాకీ సమాఖ్య (FIH) ప్రొ లీగ్ టోర్నమెంట్ లో అద్భుత విజయం సాధించింది. టోక్యో ఒలింపిక్స్ లో సిల్వర్ సాధించిన అర్జెంటీనాకు షాకిచ్చింది. నెదర్లాండ్స్ లోని రోటర్ డామ్ లో నిన్న(శనివారం) రాత్రి జరిగిన ఈ  మ్యాచ్ లో భారత్ షూటౌట్ లో 2-1 గోల్స్ తేడాతో అర్జెంటీనాను ఓడించింది. షూటౌట్ లో అర్జెంటీనా ఐదు ప్రయత్నాల్లో ఒకే గోల్ సాధించింది. అదే సమయంలో భారత క్రీడాకారులు గోల్స్ చేసి జట్టును గెలిపించారు.

అంతకుముందు నిర్ణీత సమయంలో  రెండు దేశాలకు చెందిన జట్లూ చెరో మూడు గోల్స్ చేయడంతో మ్యాచ్ 3–3తో టై అయ్యింది. భారత క్రీడాకారిణి లాల్‌‌‌‌‌‌‌‌రెమ్‌‌‌‌‌‌‌సియామి మూడో నిమిషంలోనే తొలి గోల్‌‌‌‌‌‌‌‌ అందించింది.  అర్జెంటీనా నుంచి  అగస్టినా ఏకంగా మూడు గోల్స్ కొట్టి తమ జట్టును ఆధిక్యంలోకి తీసుకెళ్లింది. అయితే.. భారత్ కు చెందిన గుర్జీత్‌‌‌‌‌‌‌‌ కౌర్‌‌‌‌ 37, 50వ నిమిషాల్లో రెండు గోల్స్ చేసి జట్టుకు ఓటమి తప్పించింది. విజేతను తేల్చేందుకు షూటౌట్ నిర్వహించగా.. అందులో భారత్ గోల్స్ తో అదరగొట్టింది.