టెక్ సామ్రాజ్యమంతా మన గుప్పిట్లోనే.. అధిపతులంతా భారతీయులే!

ప్రస్తుత రోజుల్లో టెక్నాలజీ లేకపోతే ఏ ఒక్కరి రోజు కూడా సక్రమంగా పూర్తి కాదు. ప్రస్తుత ప్రపంచమంతా టెక్నాలజీ సాయంతోనే ఉరుకులు, పరుగులు తీస్తుంది. అంతటి టెక్ సామ్రాజ్యాన్ని భారతీయులే శాసిస్తున్నారు.. ఏలుతున్నారు. ఇప్పుడు గూగుల్ నుంచి ట్విట్టర్ వరకు.. ప్రపంచ టెక్ సామ్రాజ్యానికి మనోళ్లే అధిపతులు.


ఇప్పుడు ప్రపంచ టెక్ సామ్రాజ్యమంతా భారతీయుల గుప్పిట్లోనే ఉంది. ఇంటర్నెట్ సేవల నుంచి సోషల్ మీడియా, యాప్స్, టెక్నాలజీ అన్నీ ఎక్కువగా వాడే దేశాల్లో ప్రపంచవ్యాప్తంగా మనమే టాప్. అంతేకాదు.. ప్రపంచ టెక్ దిగ్గజాలైన గూగుల్ నుంచి ట్విట్టర్ వరకు ఆయా కంపెనీల సీఈవోలంతా భారతీయులే. ఇప్పటికే గూగుల్, ఆల్ఫాబెట్, మైక్రోసాఫ్ట్, ఐబీఎం, ఎడోబ్ సీఈవోలు మనోళ్లే కాగా తాజాగా.. ఆ లిస్టులో ట్విట్టర్ కూడా చేరింది. మేటా ఒన్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌ కూడా సీఈవోగా భారతీయుడైన పరాగ్ అగర్వాల్ ని నియమించింది.

సుందర్ పిచాయ్
సుందర్ పిచాయ్.. భారత దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన టెక్ లెజెండ్. తన అకుంఠిత శ్రమ, చిత్తశుద్ధితో ప్రపంచానికి తానేంటో చాటి చెప్పిన టెక్ ధీరుడు. దక్షిణ భారతదేశం నుంచి మొదలైన ఆయన ప్రయాణం.. అమెరికా వరకు దిగ్విజయంగా సాగుతోంది. సెర్చ్ ఇంజిన్ గూగుల్, స్మార్ట్ ఫోన్ల స్థితిగతులనే మార్చేసిన ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ ఆవిష్కరణ వంటి ఎన్నో అద్భుతాలు సుందర్ పిచాయ్ చేసినవే.

తమిళనాడు రాష్ట్రం మధురైలో 1972 జూన్ 10న  సుందర్ పిచాయ్ జన్మించారు. చెన్నైలోని జవహర్ విద్యాలయలో ప్రాధమిక పూర్తి చేసి.. ఖరగ్‌పూర్‌ లో ఐఐటీ పూర్తి చేశారు. ఆ తర్వాత అమెరికా వెళ్లి అక్కడి పెన్సిల్వేనియా యూనివర్సిటీలో వార్టన్ స్కూల్ నుంచి ఎంబీఏ పట్టా తీసుకున్నారు. ఆ వెంటనే 2004లో గూగుల్ లో పని చేయడం ప్రారంభించారు. గూగుల్ సంస్థలో చేరిన తరువాత ఆయన చేపట్టిన తొలి ప్రాజెక్ట్ క్రోమ్ బ్రౌజర్. క్రోమ్ ఆపరేటింగ్ సిస్టమ్ బృందానికి సారథ్యం వహించిన సుందర్ దీన్ని అద్భుతంగా డెవలెప్ చేసి చూపించారు. దాంతో.. గూగుల్ 2008లో ప్రొడక్ట్ డెవలెప్‌మెంట్ వైస్ ప్రెసిడెంట్‌గా ప్రమోషన్ ఇచ్చింది. అలా అంచెలంచెలుగా ఎదిగిన సుందర్ పిచాయ్.. 2015లో ఏకంగా గూగుల్ సీఈఓ అయ్యారు. 2019 నుంచి గూగుల్ మాతృ సంస్థ అయిన ఆల్ఫాబెట్ సీఈఓ బాధ్యతలు కూడా ఆయనే నిర్వర్తిస్తున్నారు.

సత్యనాదెళ్ల
సత్య నాదెళ్ల.. ప్రపంచంలో ఈ పేరు తెలియని వారుండరు. మైక్రోసాఫ్ట్ సీఈవోగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సత్య నాదెళ్ల 2014లో మైక్రోసాఫ్ట్ సంస్థకు సీఈవోగా నియామకమయ్యారు. అంతకంటే ముందు ఆయన మైక్రోసాఫ్ట్‌లో క్లౌడ్ అండ్ ఎంటర్‌ప్రైజెస్ విభాగానికి ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా బాధ్యతల నిర్వర్తించారు. ఇప్పుడు బిల్ గేట్స్, స్టీవ్ బాల్మేర్ ల తర్వాత మూడో సీఈవోగా సత్య నాదెళ్ల బాధ్యతల్లో ఉన్నారు.

సత్య నాదెళ్ల స్వస్థలం ఏపీలోని అనంతపురం జిల్లా, ఎల్లనూరు మండలం, బుక్కాపురం గ్రామం. ఆయన తండ్రి మాజీ ఐఏఎస్ అధికారి. 2004 నుంచి 2009 వరకు కేంద్ర ప్రణాళిక సంఘం సభ్యునిగా, ప్రధానమంత్రి కార్యదర్శిగా పనిచేశారు. 1967లో బీఎన్ యుగంధర్ దంపతులకు హైదరాబాద్‌లో సత్య నాదెళ్ల జన్మించారు. సత్య నాదెళ్ల స్కూల్ ఎడ్యుకేషన్ హైదరాబాద్‌లోనే సాగింది. మణిపాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్‌లో బీఈ పూర్తి చేశారు. ఆ తర్వాత అమెరికాలోని విస్కాన్సిన్ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ, చికాగో యూనివర్సిటీ నుంచి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లోనూ మాస్టర్స్ డిగ్రీ చదివారు. అనంతరం పలు సాఫ్ట్‌వేర్ కంపెనీలు వివిధ హోదాల్లో పనిచేశారు. అమెరికా పౌరసత్వం తీసుకుని అక్కడే స్థిరపడ్డారు. కొంతకాలం సన్ మైక్రో సిస్టమ్స్‌లో పనిచేసి 1992లో మైక్రోసాఫ్ట్‌లోకి అడుగుపెట్టారు. వ్యాపార సేవల విభాగంలో కీలక పాత్ర పోషించి ఐదేళ్లలోనే కంపెనీ వ్యాపారాన్ని దాదాపు రూ. 9 వేల కోట్ల నుంచి రూ. 31 వేల కోట్లకు చేర్చారు. కొత్త సవాళ్లను స్వీకరించి సమర్థంగా నిర్వహిస్తూ ఆ తర్వాత పదేళ్లలోనే కంపెనీ సీఈవోగా బాధ్యతలు స్వీకరించారు.

అరవింద్ కృష్ణ
ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పేరున్న ఐబీఎం‌కు అరవింద్ కృష్ణ బిజినెస్ ఎగ్జిక్యూటీవ్ చైర్మన్, సీఈవోగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఏప్రిల్ 2020 నుంచి ఆయన సీఈవోగా ఉన్నారు. జనవరి 2021లో కంపెనీ చైర్మన్‌గా కూడా ఆయనకే బాధ్యతలు అప్పజెప్పింది. 1990లో ఐబీఎంలో చేరిన అరవింద్ కృష్ణ.. ఐబీఎం క్లౌడ్, కాగ్నిటివ్ సాఫ్ట్‌వేర్, ఐబీఎం రీసెర్చ్ విభాగాల బాధ్యతలు నిర్వహించారు. 2015లో సీనియర్ వైస్ ప్రెసెడెంట్‌గా పదోన్నతి పొందారు. కంపెనీ చరిత్రలో నిలిచిపోదగ్గ డీల్ రెడ్ హ్యాట్ కొనుగోలులో ఆయన పాత్ర కీలకం.


ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లాలో 1962లో 1962లో పుట్టారు. ఆయన తండ్రి ఆర్మీ మేజర్ జనరల్ వినోద్ కృష్ణ. తల్లి ఆరతి కృష్ణ. అరవింద్ కృష్ణ స్కూల్ ఎడ్యుకేషన్ అంతా స్టేన్స్ ఆంగ్లో ఇండియన్ హయ్యర్ సెకండరీ స్కూల్ కూనూర్, తమిళనాడులోని సెయింట్ జోసఫ్స్ అకాడమీ డెహ్రాడూన్‌లో చదివారు. ఆ తర్వాత ఐఐటీ కాన్పూర్ లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌ పూర్తి చేశారు. యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో పీహెచ్‌డీ పట్టా పొందారు.

శంతను నారాయణ్..
ఇండో – అమెరికన్ వ్యాపారవేత్తగా ప్రత్యేకత సాధించిన నారాయణ్ ప్రస్తుతం అడోబ్ కంపెనీకి సీఈవోగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయన హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగారు. హైదరాబాద్ పబ్లిక్‌ స్కూల్‌, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆయన విద్యాభ్యాసం చేశారు. ఆ తర్వాత అమెరికాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం, బర్కిలీలో ఎంబీఏ చేశారు. ఓహయో లోని బౌలింగ్ గ్రీన్ స్టేట్ విశ్వవిద్యాలయం నుంచి ఎంఎస్ చదివారు.


శంతను 1998లో అడోబ్‌లో ఇంజనీరింగ్ టెక్నాలజీ గ్రూప్ వైస్ ప్రెసిడెంట్, జనరల్ మేనేజర్‌గా బాధ్యతల్లో చేరారు. ఆ తర్వాత 2005లో ప్రెసిడెంట్, సీఓఓగా బాధ్యతలు స్వీకరించారు. 2007లో సీఈవో, 2017లో బోర్డు ఛైర్మన్ అయ్యాడు. దాంతో పాటే.. శంతను యుఎస్-ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్‌షిప్ ఫోరమ్‌కి వైస్ చైర్మన్, ఫైజర్ బోర్డులో మెంబర్ గా కూడా ఉన్నారాయన. గతంలో డెల్ కంపెనీ డైరెక్టర్‌గా పనిచేశాడు. యూఎస్ ప్రెసిడెంట్ మేనేజ్‌మెంట్ అడ్వైజరీ బోర్డులో నారాయణ్ మెంబర్. అడోబ్‌లో చేరే కంటే ముందు, శాంతను యాపిల్ అండ్ సిలికాన్ గ్రాఫిక్స్‌లో ప్రోడక్ట్ డెవలప్‌మెంట్ లో కీలక పాత్ర పోషించాడు.

పరాగ్ అగర్వాల్
తాజాగా ట్విట్టర్ సీఈవోగా నియామకమై వార్తల్లో వ్యక్తిగా నిలిచారు పరాగ్ అగర్వాల్. సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ సీఈవో జాక్ డోర్సే.. పరాగ్ అగర్వాల్ కి కంపెనీ బాధ్యతలు అప్పగించి ట్విట్టర్ సీఈవో బాధ్యతల నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించారు. సంస్థలో చేరిన పదేళ్ల కాలంలోనే పరాగ్‌ అగర్వాల్‌ కంపెనీలో అత్యున్నత పదవిని దక్కించుకున్నారు.

భారత్‌కు చెందిన పరాగ్‌ అగర్వాల్‌ 2005లో బాంబే ఐఐటీ నుంచి కంప్యూటర్‌ సైన్స్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ చదివారు. స్టాన్‌ఫోర్డ్‌ వర్సిటీలో 2011లో కంప్యూటర్‌ సైన్స్‌ లో పీహెచ్‌డీ చేశారు. పీహెచ్‌డీ చేస్తున్నప్పుడే మైక్రోసాఫ్ట్‌, ఏటీ అండ్‌ టీ ల్యాబ్స్‌, యాహూలలో రీసెర్చి ప్రాజెక్టులు చేశారు. 2011లో ట్విటర్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా ఉద్యోగంలో చేరిన పరాగ్‌ అగర్వాల్‌.. 2018లో ట్విటర్‌ సీటీవోగా నియామకమయ్యారు. గత పదేళ్లుగా ట్విట్టర్‌లో పనిచేస్తున్న ఆయన.. ట్విట్టర్‌ టెక్నికల్‌ స్ట్రేటజీ, మెషిన్‌ లెర్నింగ్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ విభాగంలో కంజ్యూమర్‌, రెవెన్యూ, సైన్స్‌ టీమ్ ల బాధ్యతలు చూస్తున్నారు.