చదువులో వెనకబడిపోయానని.. ఇంటర్ విద్యార్థిని సూసైడ్

Suicide

ఆంధ్రప్రదేశ్ విజయనగరం జిల్లాలో చదువులో వెనకబడిపోయానని బాధపడుతూ.. ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బొండపల్లి మండలం శ్యామలవలస గ్రామానికి చెందిన తడ్డి ఉష (18) తాతయ్య ఇంటి నుంచి పిడిశీల గ్రామంలో ఉంటూ చదువుకుంటుంది.

ఉష తల్లిదండ్రులు పార్వతి, రమణమూర్తి విజయనగరం మయూర జంక్షన్ సమీపంలో టిఫిన్ దుకాణం నడుపుతూ జీవితం వెళ్లదీస్తున్నారు. ఉష గజపతినగరంలోని ఓ ప్రైవేట్ జూనియర్ కాలేజీలో ఇంటర్‌ ఫస్టియర్ చదువుతున్నది.

బైపీసీ కోర్సులో చేరిన ఉష.. చదువులో వెనకబడిపోయింది. గత రెండు రోజులుగా కాలేజీకి వెళ్లలేదు. సోమవారం సాయంత్రం అమ్మమ్మ పొలానికి వెళ్లడం గమనించిన ఉష.. ఇంటి పైకప్పుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నది. మృతురాలి అమ్మమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.