గాంధీజీ భార‌త్ కాస్తా గాడ్సే భార‌త్‌లా మారుతున్నదా?: మెహ‌బూబా ముఫ్తీ

Mehbooba-Mufti

జ‌మ్ముక‌శ్మీర్ మాజీ ముఖ్య‌మంత్రి, పీడీపీ అధ్య‌క్షురాలు మెహ‌బూబా ముఫ్తీ కేంద్రంలోని మోడీ సర్కారుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

ఇటీవ‌ల‌ భార‌త్‌-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్‌లో పాకిస్థాన్ గెలిచింద‌ని ఆగ్రాలో కొంత‌మంది యువకులు సెలబ్రేషన్స్ చేసుకున్నారు. బీజేపీ ప్ర‌భుత్వం కేసులు పెట్టింద‌ని, అస‌ల‌ది నేరం ఎలా అవుతుంద‌ని ఆమె ప్ర‌శ్నించారు.

భార‌త్ గెలిచినా పాకిస్థానీలు అభినందించ‌డం, పాకిస్థాన్ గెలిచినా భార‌తీయులు అభినందించ‌డం వాజ్‌పేయి హ‌యాం నుంచి ఉన్నట్లు త‌న‌కు గుర్తున్న‌ద‌ని చెప్పారు. పాకిస్థాన్ మాజీ అధ్య‌క్షుడు ప‌ర్వేజ్ ముషార‌ఫ్ కూడా అప్ప‌ట్లో భార‌త క్రికెట్ జ‌ట్టు కెప్టెన్ మ‌హేంద్ర‌సింగ్ ధోనిని ప్ర‌శంసించార‌ని మెహ‌బూబా ముఫ్తీ గుర్తుచేశారు.

కేసులు పెట్ట‌డం క‌రెక్ట్ కాదన్న ఆమె… వాళ్ల కేసును వాదించేందుకు ఒక్క లాయర్ కూడా ముందుకు రాక‌పోవ‌డం దారుణమన్నారు. ఇదంతా చూస్తుంటే త‌న‌కు గాంధీజీ భార‌త్ కాస్తా గాడ్సే భార‌త్‌లా మారుతున్న‌ట్లు అనిపిస్తున్న‌ద‌ని ముఫ్తీ తీవ్రంగా వ్యాఖ్యానించారు.