డాలర్‌ శేషాద్రి మరణం వ్యక్తిగతంగా తీరని లోటు: జస్టిస్‌ ఎన్‌.వి.రమణ

Justice NV Ramana pays tribute to Dollar Seshadri

తిరుమల శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్‌ శేషాద్రి భౌతికకాయానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నివాళులర్పించారు. విశాఖపట్నంలో నిన్న గుండెపోటుతో మరణించిన శేషాద్రి భౌతికకాయాన్ని తిరుపతిలోని ఆయన నివాసానికి తరిలించారు. కాగా మంగళవారం ఉదయం ఆయన భౌతికకాయాన్ని పలువురు ప్రముఖులు సందర్శించి నివాళులు అర్పించారు. ఢిల్లీ నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న సీజేఐ.. నేరుగా తిరుపతిలోని డాలర్‌ శేషాద్రి నివాసం వద్దకు చేరుకుని పార్థివదేహంపై పుష్పగుచ్ఛం ఉంచి అంజలి ఘటించారు.

శ్రీవారికి అత్యంత ప్రీతి పాత్రమైన శేషాద్రి స్వామి ఇక లేరు అన్నది నమ్మలేకపోతున్నానని సిజేఐ ఎన్వీ రమణ అన్నారు. శేషాద్రి స్వామితో తనకు 25 సంవత్సరాల అనుబంధం ఉందని గుర్తు చేసుకున్న ఆయన .. శేషాద్రి స్వామి మరణం తనకు వ్యక్తిగతంగా తీరని లోటు అని చెప్పారు. ఆయన లేకుండా తిరుమలకు రావడం ఉహించలేనిదని చెబుతూ.. దేవుణి సేవలో తరిస్తూ.. వారి ఆరోగ్యాన్ని కూడా విస్మరించారన్నారు. ఆయన కోరిక మేరకు శ్రీవారి సేవలో వుండగానే చివరి శ్వాస విడిచారని చెప్పారు. శేషాద్రి స్వామి రచించిన పుస్తకాలను టీటీడీ ముద్రించి భక్తులకు అందుబాటులో తీసుకురావాలని కోరారు.

సీజేఐ వెంట తెలంగాణ ఆర్‌అండ్‌బీ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శ్రీనివాసరాజు, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్‌రెడ్డి తదితరులు ఉన్నారు. టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. గత 25 సంవత్సరాలుగా స్వామివారికి అంకితమై సేవలందించారని అన్నారు. అంతకుముందు ఏపీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, మాజీ సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యంతో పాటు కంచి పీఠం తరఫున వచ్చిన ప్రతినిధులు డాలర్‌ శేషాద్రి భౌతికకాయానికి నివాళులర్పించారు. కాసేపట్లో తిరుపతిలోని సత్యహరిశ్చంద్ర శ్మశానవాటికలో అంతక్రియలు జరగనున్నాయి.