జులై 7 నుంచి కాకతీయుల ఉత్సవాలు

హనుమకొండ: హనుమకొండ హరిత కాకతీయ హోటల్ లో రాష్ట్ర అబ్కారీ, క్రీడలు, టూరిజం శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రెస్ మీట్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, వరంగల్ మేయర్ గుండు సుధారాణిలు మీడియాతో మాట్లాడారు.

మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ‘‘ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించారు కాబట్టి సీఎం కేసీఆర్ కు వరంగల్ జిల్లా పై ప్రేమ ఎక్కువ. హైదరాబాద్ తరువాత తెలంగాణలో అతి పెద్ద నగరంగా వరంగల్ ను అభివృద్ధి చేస్తున్నారు. పరిశ్రమలు వరంగల్ లో అభివృద్ధి చేసేందుకు కేసీఆర్ ప్రభుత్వం కృషి చేస్తుంది. అనేక పరిశ్రమలు వరంగల్ కు తెచ్చేందుకు కేటీఆర్ కృషి చేస్తున్నారు. కాకతీయుల పాలన కాలం వారి కలవైభవం ప్రపంచానికి తెలిపేందుకు కేసీఆర్ సంకల్పించారు. కాకతీయులకు ఇష్టమైన, సెంటిమెంట్ గా భావించే 7 తేదీ నుంచి 7 రోజుల పాటు కాకతీయ ఉత్సవాలు నిర్వహించబోతున్నాం. జులై 7 తేదీ నుంచి కాకతీయుల ఉత్సవాలు నిర్వహిస్తాం.. దానికి సంబంధించి షేడ్యుల్ త్వరలోనే ప్రకటిస్తాం. వారోత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లకోసం సన్నాహాలు చేసేందుకు అధికారులతో సమీక్ష నిర్వహించాం.’’ అని మంత్రి వివరించారు.

కాకతీయ వంశస్థులకు ఆహ్వానం

ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.. కాకతీయుల కాలం నాటి నుంచి ఘనమైన చరిత్ర కలిగిన నగరం వరంగల్. గొలుసుకట్టు చెరువులలో సాగు తాగు నీటి సమస్య లేకుండా నిర్మాణాలు చేపట్టిన ఘనత కాకతీయుల సామ్రాజ్యానికి సొంతం. వారం పాటు కాకతీయుల ఉత్సవాలు నిర్వహించబోతున్నాము. 22వ కాకతీయ వంశానికి రాజు అయిన కమల్ చంద వాసుదేవ్ కాకతీయను ఉత్సవాలకు ఆహ్వానిస్తున్నట్లు ప్రభుత్వ చీఫ్ విప్ తెలిపారు.