ఇది ప్రకాశ్‌రాజ్‌ కు మాత్రమే జరిగిన అవమానం కాదు.. కన్నడిగుల తీవ్ర ఆవేదన

Kannada cinema audiences feel that insulting Prakash Raj in the name of localism should not be forgotten

Kannada cinema audiences feel that insulting Prakash Raj in the name of localism should not be forgotten

ఆదివారం తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించి జరిగిన ‘మా’ ఎన్నికలు పొరుగు సోదర రాష్ట్రాల్లో కలకలం రేపుతున్నాయి. విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్‌ ను స్థానికత పేరుతో టాలీవుడ్ లో జరిగిన ఎన్నికల సందర్భంలో వేరు చేసి మాట్లాడారని, ఇది తమకు ఘోర అవమానమని కన్నడ సినీ రంగం, కన్నడ ప్రేక్షకులు అంటున్నారు. సర్వ భాషా సమాహారం అయిన కళామతల్లికి స్థానికత అంటకట్టి ఓ ప్రముఖ బహు భాషానటుణ్ని ఉద్దేశ్య పూర్వకంగా అవమానించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలుగు వారితో మిళితమై, తెలుగు వారు సైతం పలుకని భాషా పటిమతో గడచిన రెండు దశాబ్దాలకు పైగా తెలుగు సినీ రంగం ద్వారా తెలుగు ప్రేక్షకుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న ప్రకాశ్‌రాజ్‌ ని స్థానికేతరుడని వేర్భాటం చేసి వేలెత్తి మాట్లాడటాన్ని జీర్ణించుకోలేక పోతున్నట్లు పలువురు కన్నడ ప్రేక్షకులు విచారం వ్యక్తం చేశారు.

పోటీలో గెలుపోటములు సహజమని అయితే గెలుపుకోసం ఇలా స్థానికత అంశం పైకి తెచ్చి కళకు కళాకారులకు తీరని అవమానం అంటున్నారు. స్థానికతే కారణమైతే కర్ణాటక రాష్ట్రానికి చెందిన జయలలిత తమిళనాడు రాజకీయాల్లోనూ, మహారాష్ట్రకు చెందిన రజనీకాంత్ దక్షిణ భాషల్లోనూ, అంతెందుకు ఇటీవల తమిళ సినీ కళాకారుల సంఘానికి నెల్లూరుకు చెందిన తెలుగు వ్యక్తి విశాల్ అధ్యక్షుడు కాలేదా?అని వారు ప్రశ్నిస్తున్నారు.

తెలుగు భాషలో మంచి నటుడుగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుని, తెలుగు జాతితో మమేకమై ఒక గ్రామాన్నికూడా దత్తత తీసుకుని మరీ సేవలందిస్తున్న ప్రకాష్ రాజు పట్ల కొందరు వ్యవహరించిన తీరు కన్నడ ప్రజలు,కన్నడ సినీ పరిశ్రమాకు తీవ్ర మనస్తాపం కలిగించినట్లు పలువురు చెప్పారు.

ప్రకాశ్‌రాజ్‌ పట్ల అంత అవమానకరంగా వ్యవహరించిన వారిని కన్నడ సినీ పరిశ్రమ, ప్రేక్షకులు గుర్తుంచుకుంటారని, ఇది ప్రకాష్ రాజ్ కి మాత్రమే జరిగిన అవమానం కాదని, తెలుగు సినిమాలు సోదర భావంతో ఆదరిస్తూ అర్ధ శతాబ్ది, శతాబ్ద దినోత్సవాలు జరుపుకునేలా తెలుగు పరిశ్రమను కన్నడ నాట ఆదరిస్తున్న కన్నడ ప్రజలకు జరిగిన అవమానంగా భావిస్తున్నట్లు పలువురు కన్నడ ప్రజలు, ప్రేక్షకులు ఆవేదనతో పేర్కొన్నారు. కాలమే తగిన జవాబు చెబుతుందని వారు నిర్లప్తంగా వ్యాఖ్యానించారు.