
నిన్న జరిగిన పంజాబ్ కింగ్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచులో ఉత్కంఠ పోరులో రెండు పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించిన విషయం తెలిసిందే. చివరి ఓవర్లో పంజాబ్ కి కావాల్సిన పరుగులు 4 మాత్రమే. కానీ.. ఆ సమయంలో ఓ కుర్రాడు చివరి ఓవర్ వేసేందుకు బంతి అందుకున్నాడు. అతడి పేరే కార్తీక్ త్యాగి. ఫస్ట్ బాల్ మెయిడెన్. రెండో బంతికి సింగిల్. మూడో బంతికి వికెట్. మిగిలిన మూడు బంతుల్లో మూడు పరుగులు చేయాలి. అందరూ పంజాబ్ మ్యాచ్ గెలుస్తుందనుకున్నారు. కానీ చూస్తుండగానే టెన్షన్ పెరిగిపోయింది. నాలుగో బంతికి రన్ రాలేదు. ఐదో బంతికి మరో వికెట్. చూస్తుండగానే మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ చేతిలోకి వెళ్లిపోయింది. చివరి బంతికి కావాల్సిన పరుగులు మూడు. కానీ.. కార్తీక్ త్యాగి చివరి బంతికి కూడా రన్ ఇవ్వలేదు. అంతే.. మ్యాచ్ రాజస్థాన్ పరం అయింది.

ఐపీఎల్ రెండో సెషన్ ను ఉత్కంఠ పోరులో సంచలన విజయంతో రాజస్థాన్ రాయల్స్ ప్రారంభించింది. రాజస్థాన్ రాయల్స్ ఇచ్చిన 185 పరుగుల లక్ష్యంతో బ్యాటింగుకు దిగిన పంజాబ్ కింగ్స్ బ్యాట్స్ మెన్లు రెచ్చిపోయి ఆడారు. ఓపెనర్లు మయాంక్ 43 బంతుల్లో ఏడు ఫోర్లు, రెండు సిక్సులతో 67 పరుగులు, రాహుల్ 33 బంతుల్లో నాలుగు ఫోర్లు, రెండు సిక్సులు కొట్టి 49 పరుగులు చేసి.. 186 లక్ష్యాన్ని ఈజీగా గెలవొచ్చు అనిపించారు. కాగా.. చివరి ఓవర్ తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు కార్తీక్ త్యాగి. 29 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీసి రాజస్థాన్ విజయానికి బాటలు వేశాడు.

మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 185 పరుగులు చేసి ఆలౌట్ అయింది. యశస్వి జైస్వాల్ 36 బంతుల్లో నాలుగు ఫోర్లు, రెండు సిక్సులు కొట్టి 49 పరుగులు చేశాడు. లొమ్రార్ చెలరేగిపోయి ఆడి 17 బంతుల్లో రెండు ఫోర్లు, నాలుగు సిక్సులతో 43 పరుగులు చేశాడు. ఆ తర్వాత వచ్చిన లుయీస్ 21 బాల్స్ ఆడి ఏడు ఫోర్లు, ఒక సిక్స్ తో 36 పరుగులు చేయడంతో రాజస్థాన్ స్కోర్ 200 దాటిస్తుండేమో అనిపించారు. రాజస్థాన్ దూకుడును పంజాబ్ బౌలర్లు అర్షదీప్ (5/32), షమీ (3/21) కళ్లెం వేశారు. అయితే ఇన్నింగ్స్ ఆద్యంతం పంజాబ్ ఆధిపత్యం కొనసాగినా.. ఆఖరి ఓవర్లో కార్తీక్ అద్భుత బౌలింగ్‌తో విజయం రాయల్స్‌నే వరించింది. చివరి ఓవర్ వేసిన కార్తీక్ త్యాగి మ్యాచ్ ఫలితాన్నే మార్చేశాడు.