మూడురోజుల పాటు కాశీ విశ్వనాథుడి దర్శనాలకు బ్రేక్

ఉత్తరప్రదేశ్‌లోని కాశీ విశ్వనాథుని దర్శనాన్ని మూడురోజుల పాటు నిలిపివేస్తున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు. ఆలయ పునరుద్ధరణ, సుందరీకరణలో భాగంగా విశ్వనాథుడి ఆలయాన్ని మూసివేయనున్నారు. నవంబర్ 29 నుంచి డిసెంబర్ 1 వరకు భక్తుల దర్శనాలు నిలిపివేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. కాశీ విశ్వనాథుడి దర్శనం పూర్తిగా నిలిపివేయడం ఆలయ చరిత్రలోనే ఇది రెండోసారి. గతంలో కరోనా నేపథ్యంలో మొదటిసారి మూసివేశారు.


గర్భగుడిలో రాతి కట్టడంపై పెయింట్ తొలగించేందుకు పాలిషింగ్‌ పనులు చేయనున్నారు. నవంబర్ 29, 30 తేదీల్లో ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు దర్శనాలను నిలిపివేస్తున్నటు అధికారులు తెలిపారు. డిసెంబర్ 1 తెల్లవారుజాము నుంచి డిసెంబర్ 2 ఉదయం 6 గంటల వరకు పూర్తిగా దర్శనాలు నిలిపివేస్తారు. ఈ సమయంలో గర్భగుడి లోపలి గోడలను శుభ్రం చేయనున్నారు. ఆలయ విస్తరణ, సుందరీకరణ పనులను డిసెంబర్ 13లోపు పూర్తిచేస్తామని ఆలయ నిర్వహాకులు చెప్పారు.