బర్త్‎డే రోజే బాత్రూంలో శవమైన యంగ్ హీరోయిన్

చాలామంది తమ బర్త్‎డేను స్నేహితులతో కలిసి ఉత్సాహంగా జరుపుకుంటారు. కానీ అదే పుట్టినరోజు వారి జీవితంలో చివరి రోజు అయితే.. ఊహించడానికే చాలా బాధగా ఉంటుంది. అచ్చు ఇలాంటి ఘటనే కేరళలో చోటుచేసుకుంది. కోజికోడ్‌కు చెందిన యువ మోడల్, వర్థమాన నటి సహానా మే 12 తన 21వ బర్త్‎డేను జరుపుకుంది. కానీ అదే రోజు రాత్రి ఆమె చనిపోయింది.

కాసర్‌గోడ్ జిల్లా చెరువత్తూరుకు చెందిన సహానా పలు జ్యువెలరీ యాడ్స్‌లో నటించింది. ఈ మధ్యే కొన్ని చిత్రాలలో కూడా నటించింది. ఆమె ఖతార్‌లో ఉద్యోగం చేస్తున్న సజ్జాద్‌ను ఏడాదిన్నర క్రితం పెళ్లాడింది. కోజికోడ్‌లోని సజ్జద్ ఇంట్లో కొత్త జీవితాన్ని ప్రారంభించింది. అయితే పెళ్లైన కొన్నాళ్లకే సజ్జాద్‌తో పాటు అత్తమామలు, ఆడపడచు తనను చిత్రహింసలకు గురిచేస్తున్నారని సహానా కుటుంబసభ్యులకు చెప్పింది. దాంతో సహానా తల్లి వేరు కాపురం పెట్టమని సూచించింది. దాంతో దంపతులిద్దరూ కొన్ని వారాల క్రితం కోజికోడ్ నగరంలోని పరంబిల్ బజార్‌లోని అద్దె ఇంటికి మారారు.

కొత్త ఇంటికి మారిన తర్వాత కూడా సజ్జద్‎లో మార్పు రాలేదు. అక్కడ కూడా రోజూ తాగొచ్చి సహానాతో గొడవపడుతుండేవాడు. తాజాగా ఆమె ఓ చిత్రంలో నటించడంతో కొంత డబ్బు వచ్చింది. ఆ డబ్బు విషయమై ఇద్దరి మధ్య గొడవజరిగింది. అదేవిధంగా సహానా పుట్టినరోజున సజ్జద్ తాగి ఇంటికి ఆలస్యంగా వచ్చాడు. దాంతో మరోసారి ఇద్దరూ గొడవపడ్డారు. ఆ తర్వాత ఏం జరిగిందో కానీ, సహానా బాత్రూంలో అచేతనంగా పడి ఉందని.. సజ్జద్ ఆమె తల్లిదండ్రులకు రాత్రి ఒంటి గంట సమయంలో ఫోన్ చేశాడు.

‘నా కుమార్తె ఎప్పటికీ ఆత్మహత్య చేసుకోదు. కచ్చితంగా ఆమె హత్య చేయబడింది. ఆమె అత్తింటి వాళ్లు తనను చిత్రహింసలకు గురిచేస్తున్నారని ఆమె నిత్యం ఏడ్చేది. సజ్జద్ మద్యం తాగి గొడవలు సృష్టించేవాడు. అతని తల్లిదండ్రులు మరియు సోదరి కూడా ఆమెను చిత్రహింసలకు గురిచేస్తున్నారని మాకు చెప్పింది. మేం ఇచ్చిన 25 సవర్ల బంగారాన్ని కూడా వాడుకున్నారు. సహానా తన పుట్టినరోజున మమ్మల్ని కలవాలనుకుంది. కానీ, సజ్జద్ గొడవపడటంతో మమ్మల్ని కలవలేదు’ అని వాపోయారు.

సహానా కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు సజ్జద్‎ను అదుపులోకి విచారిస్తున్నామని ఏసీపీ సుదర్శన్ తెలిపారు. ‘బాత్‌రూమ్‌లో ప్లాస్టిక్ తాడు లభించింది. కానీ ఆ తాడుతో ఆత్మహత్య చేసుకుందో లేదో మాకు తెలియదు. ఇది ఆత్మహత్యా లేక హత్యా అనేది ఇంకా కచ్చితంగా తెలియలేదు. మేం దర్యాప్తు చేస్తున్నాం’ అని పోలీసు అధికారి తెలిపారు.