కలకత్తా నైట్ రైడర్స్ తో తలపడుతున్న హైదరాబాద్ సన్ రైజర్స్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసేందుకు నిర్ణయించుకుంది. కాగా.. తొలుత బ్యాటింగ్ కు దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాట్స్ మెన్స్ మీద కలకత్తా బౌలర్లు విజృంభిస్తున్నారు. రెండో బంతికే వృద్ధిమన్ సాహాని ఔట్ చేసి.. సన్ రైజర్స్ ని కోలుకోలేని దెబ్బ కొట్టాడు కతకత్తా బౌలర్ సౌథీ. రాయ్ కొద్దిగా బ్యాట్ ఝుళిపించేందుకు ప్రయత్నించినా.. మూడో ఓవర్లో నాలుగో బంతికి శివమ్ కి క్యాచ్ ఇచ్చి దొరికిపోయాడు. ఐదో ఓవరలో సన్ రైజర్స్ బ్యాట్స్ మెన్లు కేవలం ఒకే ఒక రన్ చేశారంటే.. కలకత్తా బౌలర్ల బంతి ఎంత స్వింగ్ లో వస్తుందో అర్థం చేసుకోవచ్చు. విసుగు చెందిన విలియమ్స్ ఆరో ఓవర్లో ఏకంగా 18 పరుగులు పిండుకున్నాడు. ఏడో ఓవర్లో బౌలింగ్ కి వచ్చిన షకీబ్ రన్ ఔట్ రూపంలో విలియమ్స్ వికెట్ తీశాడు. ఇలా పది ఓవర్లు ముగిసే సరికి సన్ రైజర్స్ 51 పరుగులకు 3 వికెట్లు కోల్పోయింది.

మెల్లగా కోలుకుంటుంది అనుకునే సమయానికి సెకండాఫ్ లో 11వ ఓవర్ తొలి బంతికే అభిషేక్ శర్మ ఔట్ అయ్యాడు. 14.2 ఓవర్లో చక్రవర్తి రూపంలో మరో వికెట్ కోల్పోయిన హైదరాబాద్ పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయింది. ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన హోల్డర్ కూడా కేవలం రెండు పరుగులే చేసి వెనుదిరిగాడు. ఆ తర్వాత అబ్దుల్ సమద్ కాస్త జోరు పెంచినా.. ఆ మరుసటి ఓవర్ 17.2 ఓవర్లో క్యాచ్ అవుట్ అయ్యాడు. 18.2 ఓవర్లో వెంకటేశ్ అయ్యర్ రూపంలో సన్ రైజర్స్ మరో వికెట్ కోల్పోవడంతో హైదరాబాద్ 100 పరుగులకే ఆలౌట్ అవుతుందేమో అనిపించారు. 20 ఓవర్లలో సన్ రైజర్స్ 8 వికెట్లు కోల్పోయి.. 115 పరుగులు చేసింది.