సర్కారు దవాఖానాలో ప్రసవించిన కలెక్టర్ భార్య.. వెల్లువలా ప్రశంసలు

Kothagudem District collector wife Delevered In GOvernment Hospital
Kothagudem District collector wife Delevered In GOvernment Hospital

ఒకప్పుడు ప్రభుత్వ దవాఖానా పేరు చెప్తే.. ‘నేను రాను బిడ్డో.. సర్కారు దవాఖానాకు’ అంటూ ఆమడ దూరం పారిపోయేవారు. పైసలు పోయినా సరే.. ప్రైవేట్ హాస్పిటల్ కి పోతేనే ప్రాణాలు నిలుస్తాయనే భ్రమల్లో ఉండేవారు చాలామంది. ఇదే అదునుగా భావించిన ప్రైవేట్, కార్పోరేట్ దవాఖానాల యాజమాన్యాలు రోగుల జేబులు గుల్ల చేసేవారు. కానీ.. తెలంగాణ స్వరాష్ట్రమైన తర్వాత రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానాల మీద ప్రత్యేక దృష్టి పెట్టింది కేసీఆర్ సర్కార్. ఏరియా దవాఖానాల నుంచి జిల్లా దవాఖానాల దాకా అన్నీ సౌకర్యాలు కల్పిస్తూ సర్కారు దవాఖానాలో వైద్యం అంటే స్వర్గసీమలో చికిత్స అనేలా ప్రభుత్వం అభివృద్ధి చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో చాలామంది చికిత్స కోసం, ప్రసవం కోసం ఇప్పుడు సర్కారు దవాఖానా బాట పడుతున్నారు. ప్రభుత్వ దవాఖానాల్లో వైద్యం, సదుపాయాలు అన్నీ బాగున్నాయని ప్రజలకు నమ్మకం కలిగించడం కోసం ఏకంగా మంత్రులు, ఉన్నత స్థాయి అధికారులే సర్కారు దవాఖానాలకు వైద్యం కోసం వస్తున్నారు. తాజాగా జిల్లా కలెక్టర్ భార్య సర్కారు దవాఖానాలో ప్రసవించి ప్రభుత్వ దవాఖానాల్లో సదుపాయల మీద ఉన్న అపోహలను తొలగించారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్ భార్య మాధవి భద్రాచలం ఏరియా దవాఖానాలో ప్రసవించి పండంటి మగ శిశువుకు జన్మనిచ్చారు. ప్రభుత్వ దవాఖానాల్లో వైద్యం చేయించుకునేందుకు ప్రజలు ముందుకు రావాలని కలెక్టర్ అనుదీప్ పిలుపునిచ్చారు. వైద్యం, సదుపాయాల్లో సర్కారు దవాఖానాల్లో దేనికి కొదవ లేదని ప్రజలకు అర్థమయ్యేందుకే సర్కారు దవాఖానాలో తన సతీమణిని ప్రసవానికి తీసుకొచ్చినట్టు కలెక్టర్ తెలిపారు. ఇదిలా ఉండగా.. గవర్నమెంట్ హాస్పిటల్ లో ప్రసవించిన కలెక్టర్ భార్య మాధవి, కలెక్టర్ అనుదీప్ లకు అభినందనలు, శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ట్విట్టర్ వేదికగా కలెక్టర్ దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.

సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో ప్రభుత్వ దవాఖానల్లో కూడా అధునాతన సౌకర్యాలతో మెరుగైన సేవలు అందిస్తున్నాయని మంత్రి అన్నారు. అందుకు నిదర్శనం కలెక్టర్‌ దంపతులేనని మంత్రి ప్రశంసించారు. ప్రజలు గవర్నమెంట్‌ హాస్పిటల్స్‌లోనే వైద్యం చేయించుకునేందుకు ఉత్సాహంగా ముందుకు రావాలని మంత్రి పిలుపునిచ్చారు. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ కూడా కలెక్టర్‌ దంపతులకు అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు.