అందరి ముఖాల్లో చిరునవ్వులు ఉండాలి.. అదే సీఎం కేసీఆర్ ఆశయం - TNews Telugu

అందరి ముఖాల్లో చిరునవ్వులు ఉండాలి.. అదే సీఎం కేసీఆర్ ఆశయంసంక్షేమ ఫలాలు, ఆసరా పెన్షన్లు, అభివృద్ధి కార్యక్రమాలు అన్నివర్గాల ప్రజలకు చేరుతున్నాయి. అన్ని రంగాల్లో అభివృద్ధి జరగాలి. పేదల ముఖాల్లో చిరునవ్వులు వెలగాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయం అన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్. చండూరు, వికారాబాద్ నుంచి టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు వచ్చిన ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలకు ఆయన తెలంగాణ భవన్ వేదికగా స్వాగతం పలికారు. 60 ఏండ్ల పాటు అధికారం అనుభవించిన కాంగ్రెస్ పార్టీ.. దేశానికి ఏం ఇచ్చింది? రాష్ట్రంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కుక్కలు చింపిన విస్తరి లా ఉందని ఆయన ధ్వజమెత్తారు.

KTR Speech At Telangana Bhavan In Joings Meeting
KTR Speech At Telangana Bhavan In Joings Meeting

మునుగోడు నియోజవర్గంలో ఇప్పటికీ ఫ్లోరోసిస్ సమస్యతో బాధపడుతున్నారు. ఇన్నేండ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి బాధ్యత లేదా? ఆ పాపం వారిది కాదా? అని ప్రశ్నించారు మంత్రి కేటీఆర్. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక నల్లగొండ జిల్లాను ఫ్లోరోసిస్ నుంచి విముక్తి చేసేందుకు మిషన్ భగీరథ నీళ్లు ఇచ్చామని ఆయన గుర్తు చేశారు. ఈరోజు రాష్ట్రాభివృద్ధికి అడ్డుపడుతూ.. ప్రజలకు అవాస్తవాలు ప్రచారం చేస్తున్న రేవంత్ రెడ్డి తెలంగాణకు తొలి ద్రోహి. ఉద్యమంలో చంద్రబాబు పంచన చేరిన రేవంత్ రెడ్డి.. అమరుడు శ్రీకాంతాచారి గురించి మాట్లాడే అర్హత ఉందా అని ఆయన ప్రశ్నించారు. మాణిక్కమ్ ఠాకూర్ కి రూ.50 కోట్లు ఇచ్చి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కొనుక్కున్నావని స్వయంగా కాంగ్రెస్ పార్టీ నేతలే అంటున్నారు. టీఆర్ఎస్ లేకపోతే.. సీఎం కేసీఆర్ లేకపోతే.. ఈ టీపీసీసీ ఎక్కడిది? టీ బీజేపీ ఎక్కడిది? మీ కలలో కూడా మీరు మీ పార్టీలకు రాష్ట్ర అధ్యక్షుడు కాకపోదురు. అలాంటి మీరు.. ముఖ్యమంత్రి కేసీఆర్ మీద సంస్కారం లేకుండా ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు.

KTR fire
KTR fire

బీజేపీ నాయకులు చేస్తున్న పాదయాత్రలు ప్రజల కోసం కాదు. తిన్నది అరగక చేస్తున్న అజీర్తి యాత్రలు. బీజేపీకి యువతను ఆగం చేయడం, ప్రజలను తప్పుదోవ పట్టించడం తప్ప వేరే పనే లేదు అని ఆయన విమర్శించారు. రాష్ర్రం చేసిన అభివృద్ధిని కేంద్ర ప్రభుత్వం నిత్యం ప్రశంసిస్తుంటే.. వీరికి నిద్ర పడుతలేదు. ప్రభుత్వ బడిలో చదివే పిల్లలకు సన్నబియ్యంతో మంచి భోజనం పెడుతున్నాం. రోజుకు ఎంతోమంది సర్కారు దవాఖానాలో ప్రసూతిలు, చికిత్సలు చేయించుకుంటున్నారు. కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ వంటి పథకాల ద్వారా పేదింటి ఆడబిడ్డల పెండ్లికి ఆసరాగా ఉంటున్నాం.. ఇన్ని ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న రాష్ట్రం ఏదైనా ఉందా అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. రైతుబంధు ఇచ్చినట్టుగానే.. దళిత బంధు పథకాన్ని కూడా రాష్ట్రం మొత్తం అమలు చేస్తాం. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి అన్నారు.