నానమ్మ ఊరిలో.. తమ పూర్వీకుల చరిత్ర చెప్పిన కేటీఆర్

కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండ‌లం కోనాపూర్‌లో నాన‌మ్మ వెంక‌ట‌మ్మ జ్ఞాప‌క‌ర్థంగా నిర్మించే స్కూల్ బిల్డింగ్‌కు కేటీఆర్ శంకుస్థాప‌న చేశారు. ఈ సంద‌ర్భంగా అక్క‌డ ఏర్పాటు చేసిన స‌భ‌లో కేటీఆర్ ప్ర‌సంగించారు. ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను కేటీఆర్ స‌భా వేదిక‌గా వెల్ల‌డించారు.

మానేరు ప్రాజెక్టుతో ఏదో అనుబంధం

మానేరు ప్రాజెక్టుకు త‌మ కుటుంబానికి ఏదో అనుబంధం ఉంద‌ని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. ఈ అనుబంధం గురించి తెలియ‌జేసేందుకు కేటీఆర్ త‌మ పూర్వీకుల క‌థ చెప్పుకొచ్చారు. నాన‌మ్మ ఊరు అప్ప‌ర్ మానేరులో, అమ్మ‌మ్మ ఊరు మిడ్ మానేరులో, ఇంకో అమ్మ‌మ్మ(అమ్మ సోద‌రి) ఊరు కూడా లోయ‌ర్ మానేరులో మునిగిపోయింద‌ని కేటీఆర్ గుర్తు చేశారు. నాన‌మ్మ‌, అమ్మమ్మల జ్ఞాప‌కార్థంగా మ‌న ఊరు – మ‌న బ‌డి ప్రోగ్రాం కింద త‌న సొంత ఖ‌ర్చుల‌తో పాఠ‌శాల‌ల‌ను నిర్మిస్తున్న‌ట్లు కేటీఆర్ వెల్ల‌డించారు.

పోస‌న్ ప‌ల్లి గురించి వినడమే.. చూసింది లేదు

పోస‌న్ ప‌ల్లి గురించి నాన‌మ్మ చెప్తుంటే విన్న‌దే త‌ప్ప చూసింది లేద‌ని కేటీఆర్ పేర్కొన్నారు. గ‌తంలో పంచాయ‌తీరాజ్‌గా మంత్రిగా ఉన్నప్పుడు బీబీపేట్ వ‌చ్చి ఇక్క‌డికి రాలేక‌పోయాను. బీబీపేట్‌లో సుభాస్ రెడ్డి పాఠ‌శాల క‌ట్టించిన‌ప్పుడు తాను కూడా పోసాన్ ప‌ల్లిలో నాన‌మ్మ జ్ఞాప‌కార్థం బ‌డి క‌ట్టిస్తాన‌ని హామీ ఇచ్చాను. అందులో భాగంగా మ‌న ఊరు – మ‌న బ‌డి కార్య‌క్ర‌మం కింద నాన‌మ్మ, అమ్మ‌మ్మ ఊరిలో బ‌డులు క‌ట్టిస్తున్న‌ట్లు కేటీఆర్ తెలిపారు. రూ. రెండున్న‌ర కోట్ల‌తో నాన‌మ్మ పేరు మీదు బ‌డిని క‌డుతున్నాను. నాన‌మ్మ ఆత్మ శాంతించాల‌ని, ఈ ఊరికి సొంతంగా మేలు చేసిన వాళ్లం కావాల‌ని ఈ నిర్ణ‌యం తీసుకున్నానని కేటీఆర్ తెలిపారు.

80 ఏండ్ల‌ కిందట మా తాత ఇల్లరికం వచ్చిండు

పోస‌న్ ప‌ల్లి ఊరితో ఉండే అనుబంధాన్ని కేటీఆర్ పంచుకున్నారు. 80 ఏండ్ల‌టి కిందటి తమ పూర్వీకుల క‌థ‌ను చెప్పుకొచ్చారు. నాన‌మ్మ‌ది పోసాన్ ప‌ల్లి, తాత‌ది సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండ‌లంలోని మోహినికుంట గ్రామం. అయితే నాయిన‌మ్మ వాళ్ల‌కు మ‌గ‌పిల్ల‌లు లేరు. పెళ్లి చేసేట‌ప్పుడే అల్లుడిని ఇల్ల‌రికం అడిగారు. రాఘ‌వ‌రావు గారు ఇక్క‌డికే వ‌చ్చారు. వ్య‌వ‌సాయం చేసి ఇక్క‌డే స్థిర‌ప‌డ్డారు. అప్ప‌ర్ మానేరు ప్రాజెక్టు అప్ప‌టికీ కాలేదు.

దాదాపు 45వ సంవ‌త్స‌రం దాకా అంటే అప్ప‌ర్ మానేరు ప్రాజెక్టు క‌ట్టేదాకా ఇక్క‌డే ఉన్నారు. న‌లుగురు పిల్ల‌ల‌ను ఇక్క‌డే క‌న్నారు. ఈ చెరువు విస్త‌రించి మానేరు వాగు మీద అప్ప‌ర్ మానేరు డ్యాం క‌ట్టాల‌ని నిజాం నిర్ణ‌యం తీసుకున్న‌ప్పుడు, చెరువు విస్త‌ర‌ణ‌లో వంద‌ల ఎక‌రాలు పోయాయి. 1940వ ద‌శ‌కంలో భూముల‌ను కోల్పోయారు. ఆనాటి రోజుల్లోనే భూమి కోల్పోయినందుకు రెండున్న‌ర ల‌క్ష‌లు ఇచ్చింది. ఇప్పుడు ఆ విలువ కోట్ల రూపాయాల్లో ఉంటుంద‌ని కేటీఆర్ తెలిపారు.

పోసాన్ ప‌ల్లి నుంచి చింత‌మ‌డ‌క‌కు.. అక్కడే కేసీఆర్ జన్మించారు

పోసాన్ ప‌ల్లిలో వచ్చిన పైసలు తీసుకొని సిద్దిపేటలోని చింత‌మ‌డ‌క గ్రామానికి తాత వెళ్లి ఐదారు వంద‌ల ఎక‌రాలు కొన్నారు. 1954లో చింత‌మ‌డ‌క‌లోనే కేసీఆర్ జ‌న్మించారు. మానేరు వాగుకు మాకు ఏదో అనుబంధం ఉంది. మానేరు వాగు మీద‌ మొద‌ట ప్రాజెక్టు క‌ట్టిన‌ప్పుడు నాన‌మ్మ భూములు పోయాయి. మిడ్ మానేరు ప్రాజెక్టు క‌డితే అమ్మ‌మ్మ ఊరు కుదురుపాక మునిగిపోయింది. లోయ‌ర్ మానేరు డ్యాంలో ఇంకో అమ్మ‌మ్మ ఊరు మునిగిపోయింద‌ని కేటీఆర్ గుర్తు చేశారు.