మ్యాచ్ రిఫరీపై అనుచితంగా ప్రవర్తించినందుకుగానూ భారత రెజ్లర్ సతేందర్ మాలిక్‌పై రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూఎఫ్ఐ) జీవితకాలం నిషేధం విధించింది. వివారాల్లోకి వెళితే.. ఇంగ్లండ్ లోని బర్మింగ్ హామ్ వేదికగా జులై 28 నుంచి ఆగస్టు 8 వరకు జరగనున్న కామన్వెల్త్ క్రీడలు జరగనున్నాయి. దీనికి సంబంధించిన ట్రయల్స్ ను ఢిల్లీలో నిర్వహిస్తున్నారు.
మంగళవారం 125 కేజీల విభాగంలో ఫైనల్ మ్యాచ్‌ను నిర్వహించారు. ఈ పోటీలో మోహిత్ చేతిలో సర్వీసెస్ జట్టుకు ఆడుతున్న సతేందర్ మాలిక్ ఓడిపోయాడు. దీంతో కామన్వెల్త్ క్రీడలకు అతను అర్హత సాధించలేకపోయాడు. అయితే ఒక దశలో సతేందర్ సింగ్ 3-0తో ఆధిక్యంలో ఉన్నాడు. అయితే ప్రత్యర్థి మోహిత్ తన బలాన్నంతా ఉపయోగించి సతేందర్‌ను మ్యాట్ బయటికి నెట్టేశాడు. అయినప్పటికీ మోహిత్ కు రిఫరీ ఒక పాయింట్ మాత్రమే కేటాయించాడు. దాంతో మోహిత్ రివ్యూ కోరాడు.
జ్యూరీ సభ్యుడిగా ఉన్న సత్యదేవ్ మాలిక్.. సతేందర్ మాలిక్ గ్రామానికి చెందినవాడు కావడంతో ఆయన జ్యూరీ నుంచి తప్పుకున్నాడు. దీంతో మోహిత్ రివ్యూను పరిశీలించే బాధ్యతను సీనియర్ రిఫరీ జగ్బీర్ సింగ్‌కు అప్పగించారు. వీడియో ఫుటేజి పరిశీలించిన జగ్బీర్ సింగ్… మోహిత్ కు ఏకంగా మూడు పాయింట్లు కేటాయించాడు. ఓడిపోతాడనుకున్న మోహిత్ కాస్తా 3-3తో మళ్లీ రేసులోకి వచ్చాడు. ఈ బౌట్ ఫలితంతో సతేందర్ మాలిక్ రగిలిపోయాడు. తాను గెలవాల్సిన మ్యాచ్… సీనియర్ రిఫరీ జగ్బీర్ సింగ్ కారణంగా ప్రత్యర్థి రెజ్లర్ మోహిత్ గెలిచాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
ఆ క్రమంలో మ్యాట్ పైకి వెళ్లిన సతేందర్ మాలిక్…. రిఫరీ జగ్బీర్ తో గొడవకు దిగాడు. ఆ తర్వాత అతని పట్ల అనుచితంగా ప్రవర్తిస్తూ ముఖంపై చేయిచేసుకున్నాడు. ఆ దెబ్బకు రిఫరీ జగ్బీర్ సింగ్ మ్యాట్ పై పడిపోయాడు. వెంటనే డబ్ల్యూఎఫ్ఐ అధికారులు సతేందర్ మాలిక్ ను అక్కడ్నించి తీసుకెళ్లడంతో పరిస్థితి సద్దుమణిగింది. కాగా, రిఫరీపై దాడికి పాల్పడిన రెజ్లర్ సతేందర్ మాలిక్ పై జీవితకాల నిషేధం విధించినట్టు డబ్ల్యూఎఫ్ఐ సహాయ కార్యదర్శి వినోద్ తోమర్ వెల్లడించారు.