లోన్ ఎగవేత.. కేంద్ర మంత్రి భార్య, కుమారుడిపై లుకౌట్‌ నోటీస్‌ జారీ

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్‌ ఠాక్రేపై ఇటీవల అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి నారాయణ్ రాణే భార్య, కుమారుడుపై ముంబై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు ఈ నెల 3న ముంబై ఎయిర్ పోర్ట్ అధికారులకు సమాచారం అందించారు.

బ్యాంకుల దగ్గర తీసుకున్న లోన్ చెల్లించడంలో వీరు విఫలయం అయ్యారని, ఎప్పుడైనా దేశం విడిచి వెళ్లిపోవచ్చునని పుణె పోలీసు డిప్యూటీ కమిషనర్ (క్రైమ్) శ్రీనివాస్ గాడ్గే చెప్పారు. అలాగే కేసు విచారణను అడ్డుకుంటారనే ఉద్దేశంలోనే కేంద్ర మంత్రి భార్య, కొడుకుపై లుకౌట్ నోటీసులు జారీ చేశామన్నారు.

ఆర్ట్ లైన్ ప్రాపర్టీస్ ప్రైవేట్‌, దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (డీహెచ్‌ఎఫ్‌ఎల్‌) నుంచి రాణే భార్య నీలం రూ. 25 కోట్ల రుణం తీసుకున్నారు. నారాయణ రాణే స్వగ్రామం కంకవలిలో రాణే కుమారుడు నితేష్ రాణే నిర్మించిన నీలం హోటల్ కోసం డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ నుంచి రూ.34 కోట్ల రుణం తీసుకున్నాడు.

రుణాలు తిరిగి చెల్లించనందున అవి ఎన్‌పీఏగా మారడంతో సదరు ఆర్థిక సంస్థలు కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశాయి. కేంద్రం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ లుకౌట్ నోటీసును జారీ చేసింది.