మీ అకౌంట్లో డబ్బులు పోయాయా?.. వెంటనే ఇలా చేస్తే.. పోయిన డబ్బులు..

హైదరాబాద్‌: సైబర్‌ నేరాలు రోజురోజుకూ పెరుగుతున్న వేళ సైబర్‌ క్రైం పోలీసులు ప్రజలను మరోసారి అప్రమత్తం చేశారు. నేరం జరిగిన వెంటనే ఫిర్యాదు చేస్తే పోయిన డబ్బులు తిరిగివచ్చే అవకాశం ఉందని వెల్లడించారు.

నేరం జరిగిన వెంటనే నేషనల్‌ సైబర్‌ క్రైం పోర్టల్‌లో కానీ, హెల్ప్ లైన్‌ నంబర్‌ 1930కి వెంటనే ఫిర్యాదు చేయాలని సూచించారు. తద్వారా బాధితుడి ఖాతా నుంచి బదిలీ అయిన నగదును ఇతర ఖాతాలకు బదిలీ అవ్వకుండా చేయవచ్చని తెలిపారు.

నేషనల్‌ సైబర్‌ క్రైం బారిన పడ్డ బాధితులు ఫిర్యాదు చేసేందుకు గతేడాది జూన్‌లో తెలంగాణ సైబర్‌ క్రైం కోఆర్డినేషన్‌ సెంటర్‌ ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ కాల్‌ సెంటర్‌ 24/7 అందుబాటులో ఉంచామని పోలీసులు తెలిపారు.

ఇప్పటివరకూ సైబర్ నేరగాళ్లు కాజేసిన రూ.15.48 కోట్లను వారి ఖాతాల్లో నిలుపుదల చేశామన్నారు. ఆర్ధిక పరమైన ఫిర్యాదులను నమోదు చేసిన వెంటనే అవి సీఎఫ్‌ఆర్‌ఎంఎస్‌లోకి వెళతాయని, దీంతో వెంటనే సంబంధిత నేరగాళ్ల ఖాతాల్లోని నగదు సీజ్ అవుతుందని సైబర్‌ క్రైం పోలీసులు తెలిపారు.