గర్ల్‎ఫ్రెండ్‎తో మాట్లాడినందుకు క్లాస్‌మేట్‌పై కత్తితో దాడి

తన గర్ల్‎ఫ్రెండ్‎తో మాట్లాడాడని క్లాస్‌మేట్‌పై కత్తితో దాడి చేశాడో యువకుడు. ఈ దారుణ ఘటన యూపీలోని లక్నోలో వెలుగుచూసింది. పట్టణానికి చెందిన చంద్రభూషణ్ భరద్వాజ్ లక్నో యూనివర్సిటీలో లా చదువుతున్నాడు. సుధాంషు అనే యువకుడు కూడా చంద్రభూషణ్‎తో పాటు చదువుతున్నాడు. అయితే సుధాంషు తన క్లాస్‎కు చెందిన యువతితో చనువుగా మాట్లాడేవాడు. కానీ కొన్నాళ్లకు సుధాంషు తీరు నచ్చక సదరు యువతి చంద్రభూషణ్‎తో స్నేహం చేయడం ప్రారంభించింది. అది నచ్చని సుధాంషు.. చంద్రభూషణ్ మీద కోపం పెంచుకున్నాడు. రోజూవారీలాగానే చంద్రభూషణ్ సోమవారం కూడా తరగతులకు హాజరయ్యాడు. అప్పటికే ప్లాన్ ప్రకారం బ్యాగులో కత్తి తెచ్చుకున్న సుధాంషు.. చంద్రభూషణ్ మీద దాడి చేశాడు. తీవ్ర గాయాలపాలైన చంద్రభూషణ్‎ను కాలేజీ యాజమాన్యం కేజీఎంయూ ట్రామా సెంటర్‎కు తరలించారు. బాధితుడికి తీవ్ర రక్తస్రావం కావడంతో అపస్మారకస్థితిలో ఉన్నాడని, ఐసీయూలో అబ్జర్వేషన్‎లో ఉంచామని వైద్యులు తెలిపారు. తోటి విద్యార్థులు, కాలేజీ యాజమాన్యం ఫిర్యాదుతో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.