సీబీఐకి స్వతంత్ర ప్రతిపత్తితో నడిచే స్వేచ్చ ఇవ్వండి. పంజరంలో చిలకలా ఎందుకు? అంటూ కేంద్రాన్ని మద్రాస్ హైకోర్టు ప్రశ్నించింది. ఎన్నికల కమిషన్, కాగ్ తరహాలో సీబీఐకి కూడా విస్తృత అధికారులు కల్పిస్తూ చట్టం తేవాలని ఆదేశించింది. సీబీఐకి వనరులు, సిబ్బంది సరిపడా లేదని.. అందుకే విచారణ చేపట్టాల్సి వచ్చినప్పుడు వెనకా ముందు ఆలోచిస్తున్నదని మద్రాస్ హైకోర్టు తెలిపింది.

పరిమిత వనరులతో దర్యాప్తు చేసేందుకు ఇబ్బంది పడాల్సి వస్తుందని సీబీఐ పలు సందర్భాల్లో పలు రాష్ట్రాల హైకోర్టులకు నివేదిక సమర్పించింది. పలు ముఖ్యమైన కేసుల విషయంలో ఈ ఇబ్బంది సరికాదని జస్టిస్ ఎన్ కిరుబకరన్, జస్టిస్ పుగలేందితో కూడిన డివిజన్ బెంచ్ పేర్కొంది. సీబీఐకి ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయింపులు చేపట్టాలని మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తులు కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. డిప్యుటేషన్‌పై ఆధారపడకుండా సీబీఐ కోసం ప్రత్యేకంగా పనిచేసే అధికారులు ఉండాలని బెంచ్ స్పష్టం చేసింది. నిధులు, సౌకర్యాల లేమి వంటి అడ్డంకులను అధిగమించి సీబీఐ పనిచేయాలని కోర్టు ఆశాభావం వ్యక్తం చేసింది.