మల్లాది చంద్రశేఖర శాస్త్రి శివైక్యం

Malladi Chandrasekhara Sastri

ప్రముఖ పురాణ ప్రవచనకర్త మల్లాది చంద్రశేఖర శాస్త్రి (96) శివైక్యమయ్యారు. వయోభారంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో శుక్రవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు.

1925 ఆగస్టు 28న గుంటూరు జిల్లా క్రోసూరులో చంద్రశేఖర శాస్త్రి జన్మించారు. పురాణ ప్రవచనాలలో ఆయన శైలి ప్రత్యేకం. భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి కల్యాణ వేడుకల  ప్రత్యక్ష వ్యాఖ్యానాలతో ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది.

భారతము ధర్మసూక్ష దర్శనము, క్రుష్ణలహరి (స్వేచ్చాంధ్రానువాదము), రామాయణ రహస్య దర్శిని తదితర గ్రంథాలను రచించారు. టీటీడీ ఆస్థాన శాశ్వత పండితుడిగా చంద్రశేఖర శాస్త్రి ప్రసిద్ధి.

ఉపరాష్ట్రపతి సంతాపం

ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త మల్లాది చంద్రశేఖరశాస్త్రి పరమపదించటం విచారకరమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయడు అన్నారు. ఆధ్యాత్మిక జ్ఞానం, సామాజిక దృక్పథాల సమ్మేళనంగా సాగిన వారి ప్రవచనాలు జనులకు మార్గనిర్దేశనం చేసేవని ఆయన ట్వీట్ చేశారు.

ఎందరికో ధర్మమార్గాన్ని చూపించిన పౌరాణికులు

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శాశ్వత ఆస్థాన పండితుడు, ప్రముఖ ప్రవచనకర్త మల్లాది చంద్రశేఖరశాస్త్రి మరణం పట్ల దేవదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు సద్గతులు కలగాలని కోరుకున్నారు. పురాణాలను శాస్త్రబద్ధంగా చెప్తూ ఎందరికో ధర్మమార్గాన్ని చూపించిన పౌరాణికులు అని ఆయన సేవలను కొనియాడారు.