రైతు నెత్తిన పెను భారం.. భారీగా పెరిగిన ఎరువుల ధర

  • రూ.1200 ఉన్న డీఏపీ ధర రూ.1900
  • ముడిసరుకు ధర పెరగడమే కారణమంటున్న కంపెనీలు

సాగునీటితో రాష్ట్రమంతా సస్యాశామలం చేస్తున్న రైతు నెత్తిన ఎరువుల భారం పడనుంది. ఎరువుల కంపెనీలు కాంప్లెక్స్‌ ధరలు పెంచాయి. దీని వల్ల రైతులపైన అదనపు భారం పడనుంది. అంతర్జాతీయంగా ముడి సరుకుల ధరలు పెరగడం వల్ల కాంప్లెక్స్‌ ధరలు పెంచామని ఎరువుల కంపెనీలు ప్రకటించినా.. రైతులు తప్పనిసరిగా ఈ భారాన్ని మోయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇప్పటికే పలు కంపెనీలు పెంచిన ధరలను ప్రకటించగా.. మరికొన్ని ప్రకటించేందుకు సిద్ధంగా ఉన్నాయి. పెరిగిన ధరలను ఈ నెల నుంచే అమలుచేయనున్నట్టు కంపెనీలు ప్రకటించాయి. రైతులు ప్రధానంగా ఉపయోగించే డీఏపీ, కాంప్లెక్స్‌ ఎరువులపై ఒక్కో బస్తాపై కనీసంగా రూ.450 పెంచాయి. పెరిగిన ధరలను ఇఫ్కో కంపెనీ బుధవారం ప్రకటించింది. డీఏపీ ధర అత్యధికంగా రూ.1,900గా నిర్ణయించింది. ప్రస్తుతం దీని ధర రూ.1,200 ఉండగా.. ఏకంగా రూ.700 పెంచింది. కాంప్లెక్స్‌ ఎరువులకు సంబంధించి కనీసం రూ.450 పెంచింది. యూరియా ధర నిర్ణయం కేంద్రం చేతుల్లో ఉండటంతో ప్రస్తుతానికి ధర పెరగలేదు. పెరిగిన ధరలతో ఒక్కోరైతుపై పెట్టుబడి ఖర్చు కనీసంగా రూ.3-5 వేలు పెరుగనున్నది.