హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. 20 ట్రిప్పుల డబ్బులతో.. 30 ట్రిప్పులు తిరగండి - TNews Telugu

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. 20 ట్రిప్పుల డబ్బులతో.. 30 ట్రిప్పులు తిరగండిmetro Hyderabad Announced Special Offer For Metro Passengers
metro Hyderabad Announced Special Offer For Metro Passengers

హైదరాబాద్‌ మెట్రో ప్రయాణికుల కోసం ఎల్ అండ్ టీ మెట్రో రైల్ (హైదరాబాద్) లిమిటెడ్ సరికొత్త ఆఫర్ ప్రకటించింది. మెట్రో సువర్ణ ఆఫర్‌ 2021 పేరుతో మెట్రో ప్రయాణికులకు పండుగ పూట శుభవార్త చెప్పింది. పలు స్కీముల పేరుతో తక్కువ డబ్బులతో ఎక్కువ ట్రిప్పులు తిరిగే ఆఫర్లను ప్రవేశపెట్టింది. ట్రిప్‌ పాస్‌ ఆఫర్‌ పేరుతో.. 45 రోజుల వ్యాలిడిటీతో 20 ట్రిప్పులకు డబ్బు చెల్లిస్తే.. 30 ట్రిప్పులు తిరగొచ్చు. అంటే అదనంగా 10 ట్రిప్పులు పొందవచ్చన్నమాట. ఆఫర్‌ వ్యాలిడిటీ టైమ్ లో ఒక్క ట్రిప్‌కు గరిష్టంగా 15 రూపాయలు చెల్లిస్తే.. గ్రీన్‌ లైన్‌పై ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించొచ్చు. క్యాలెండర్‌ నెలలో 20 మెట్రో ట్రిప్స్‌ కన్నా అధికంగా ప్రయాణించే ప్రయాణీకుల కోసం ప్రతి నెలా లక్కీ డ్రా తీయనున్నట్టు హైదరాబాద్ మెట్రో ప్రకటించింది. మెట్రో సువర్ణ ఆఫర్‌ 2021 అక్టోబర్‌ 18 నుంచి అందుబాటులో ఉంటుంది. అయితే.. ఈ ఆఫర్‌ కేవలం మెట్రో స్మార్ట్‌ కార్డ్‌ పై మాత్రమే వర్తిస్తుంది. మెట్రో ప్రయాణీకులు ఈ ఆఫర్‌ను 18 అక్టోబర్‌ 2021 నుంచి 15 జనవరి 2022 మధ్య వినియోగించుకోవాల్సి ఉంటుంది.

metro Hyderabad Announced Special Offer For Metro Passengers
metro Hyderabad Announced Special Offer For Metro Passengers

గత సంవత్సరం అక్టోబర్‌లో తొలిసారిగా ప్రకటించిన మెట్రో సువర్ణ ఆఫర్‌కు అపూర్వమైన స్పందన లభించింది. ఇప్పుడు ఈ సంవత్సరం మరోసారి ఈ ఆఫర్‌ను ప్రారంభించినందుకు సంతోషంగా ఉంది. మా ప్రయాణీకులు మా సేవల పట్ల అపారమైన నమ్మకాన్ని చూపడంతో పాటుగా మెట్రోను తమ సురక్షితమైన ప్రయాణ భాగస్వామిగా ఎంచుకుంటున్నారు. నగరంలో అత్యంత విశ్వసనీయమైన, పర్యావరణ అనుకూల, సమయపాలన కలిగిన, సురక్షితమైన, సౌకర్యవంతమైన రవాణా మాధ్యమం మెట్రో. మా ప్రయాణీకులకు మెరుగైన సేవలను అందించేందుకు మమ్మల్ని మేము మెరుగుపరుచుకుంటూనే ఈ మహమ్మారి కాలంలో అత్యంత సురక్షితమైన భద్రతా ఏర్పాట్లను చేశాము అన్నారు ఎల్‌ అండ్‌ టీ ఎంఆర్‌హెచ్‌ఎల్‌ ఎండీ అండ్‌ సీఈవో కెవీబీ రెడ్డి. మా ప్రయాణీకుల కోసం నూతన ఆఫర్లతో మెట్రో సువర్ణ ఆఫర్‌ను తిరిగి పరిచయం చేయడం సంతోషం. సురక్షితమైన ప్రయాణ అవకాశాలను అందిస్తూనే మా ప్రయాణీకుల నగదుకు తగ్గ విలువను బహుమతుల రూపంలో అందించాలనే ప్రయత్నాలలో భాగమే ఈ మెట్రో సువర్ణ ఆఫర్ అన్నారు హెచ్‌ఎంఆర్‌ఎల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎన్‌వీఎస్‌ రెడ్డి.


గ్రీన్‌ లైన్‌పై ప్రత్యేక ఫేర్‌ ఆఫర్‌ : ఎంజీబీఎస్‌, జెబీఎస్‌, పరేడ్‌ గ్రౌండ్స్‌ మెట్రో స్టేషన్‌ల నడుమ గ్రీన్‌ లైన్‌పై ప్రయాణించే ప్రయాణీకులు ప్రతి ట్రిప్‌కు గరిష్టంగా 15 రూపాయలు చెల్లిస్తే చాలు. మెట్రో ప్రయాణీకులు ఈ ఆఫర్‌ను అన్ని టిక్కెటింగ్‌ మార్గాలపై 18 అక్టోబర్‌ 2021 నుంచి15 జనవరి 2022 వరకు పొందవచ్చు.

నెలవారీ లక్కీ డ్రా : అక్టోబర్‌ 2021 నుంచి ఏప్రిల్‌ 2022 వరకూ ఆకర్షణీయమైన బహుమతులను ప్రతినెలా గెలుచుకునే అవకాశం మెట్రో ప్రయాణీకులకు ఉంది. ప్రతి నెలా ఐదుగురు విజేతలను లక్కీడ్రా తీస్తారు. సీఎస్‌సీ కార్డు (కాంటాక్ట్ లెస్ స్మార్ట్ కార్డు) వినియోగదారుల నుంచి ఎంపిక చేస్తారు. వీరు ఓ క్యాలెండర్‌ నెలలో కనీసం 20 సార్లు ప్రయాణించాల్సి ఉంటుంది. వినియోగదారులు తమ సీఎస్‌సీ (కాంటాక్ట్‌లెస్‌ స్మార్ట్‌కార్డు)లను టీ-సవారీ లేదా మెట్రో స్టేషన్‌ల వద్ద నమోదు చేసుకోవాలి.