గ్యాస్ సిలిండర్ కు దండం పెట్టి.. కారు గుర్తుకు ఓటు వేయండి: మంత్రి హరీష్ రావు

Minister Harish Rao appeal to huzurabad people to vote car symbol in by poll

Minister Harish Rao appeal to huzurabad people to vote car symbol in by poll

బీజేపీ నాయకులు మాపై ఇచ్చిన ఫిర్యాదులతో మేము ఉన్న ఇండ్లను అధికారులు తనిఖీలు చేశారని మంత్రి హరీష్ రావు చెప్పారు. ఇవాళ కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో మీడియాతో మాట్లాడారు. మా ముఖ్యమంత్రి సభ పెట్టకుండా చేశారు. బండి సంజయ్ మాత్రం సభ పెట్టుకున్నారు. రైతు నాగలి గుర్తు నుండి నేటి వరకూ టీఆర్ఎస్ గెలుస్తూనే ఉందన్నారు.

‘‘ఎన్నికలు ఏవైనా  టీఆర్ఎస్ ను ప్రజలు ఆశీర్వదించారు. ఇక్కడ సర్వేలన్నీ మేము గెలుస్తామని తెలిపాయి. ప్రస్టేషన్ తో కొంత మంది ఫోన్లు పగలకొడుతున్నారట. టీఆర్ఎస్  ఓటుకు రూ.20 వేలు ఇస్తుందని రెచ్చగొట్టే ప్రయత్నం బీజేపీ చేస్తోంది. డిపాజిట్ రాదన్న వాళ్ళు ఇప్పుడు అనుమానంలో పడిపోయారు. బీజేపీ అబద్ధాలతో ప్రచారం చేశారు. గోబెల్ ప్రచారాలకు తెరలేపారు. మహిళా సంఘాలకు చెక్కులిస్తే అవి చెల్లవు అని ప్రచారం చేశారు. కేంద్రంలో ఏడు ఏండ్ల పాలనలో అనేకసార్లు సెస్ పెంచారు.

కేంద్ర మంత్రులు సైతం ప్రజల్ని తప్పుదోవ పట్టించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ప్రజలకు అబద్ధాలు చెప్పారు. బీజేపీ కిలో చికెన్, బొట్టు బిల్లలు, డబ్బులను నమ్ముకుంది. మేము చేసిన అభివృద్ధిని నమ్ముకున్నాం. సంక్షేమ పథకాలను నమ్ముకున్నాం. ఏడేళ్ల టీఆర్ఎస్ ఏమి చేసింది.. ఏడేళ్లలో బీజేపీ ఎం చేసిందో చర్చిద్దాం అంటే ముందుకు రాలేదు. సరుకు లేకనే నోరు జారుతున్నారు. ఓటమి భయంతో ఉండి అక్కసును వెళ్ళబుచ్చారు. చాలా మంది కేంద్రం నుండి వచ్చారు. రాష్ట్ర నాయకత్వం బీజేపీ అంతా నెల రోజులుగా హుజురాబాద్ లో తిరిగారు. బొంద పెడతాము.. అంతు చూస్తాం.. ఘోరీ కడతాం తప్ప ఇంకేమి చెప్పలేదు. కేంద్రం ఏమి చేస్తోందో చెప్పలేకపోయారు. అన్నం పెట్టి పెంచిన కేసీఆర్ ను తిట్టడం రాజేందర్ కు తగదని చాలా మంది సామాన్యులు అన్నారు.

కేసీఆర్ ను పొగిడి ఆయనతో సన్నిహితంగా ఉండి ఆయన్ను తిట్టడం దుర్మార్గం. గ్యాస్ ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించమని చాలా సార్లు అడిగాము.  త్వరలో మరో 200 గ్యాస్ సిలిండర్ ధర అవుతుందని తెలుస్తోంది. గ్యాస్ సిలిండర్ కు దండం పెట్టు కారుకు ఓటు వేయండి అనడం బాగా జనంలోకి వెళ్లింది. ఉజ్వల గ్యాస్ ఇచ్చాము అని సంజయ్ అన్నారు. అది పేదవాళ్లకు ఇవ్వాల్సిందే కదా. సిలిండర్ ను అటకెక్కించి కట్టెల పొయ్యిలనే మహిళలు వాడుతున్నారు. సబ్సిడీ అయినా ఇవ్వండి అని సమాధానం అడుగుతున్నా.. దళిత బంధు పై చెల్పూర్ గుడికి రమ్మని రాజేందర్ అన్నరు. బీజేపీనే దళిత బంధును అపమని చెప్పినట్లు ప్రజలు గమనించారు. బీజేపీ ఓట్ల కోసం తొండాట ఆడుతుంది.’’ అని హరీష్ రావు బీజేపీ పార్టీ నేతలపై మండిపడ్డారు.