బీజేపోళ్లు మోకాళ్ల మీద యాత్ర చేసినా.. గెల్లు శ్రీనివాస్ గెలుపును ఆపలేరు

Minister Harish Rao Comments On BJP Policies on Handloom sector
Minister Harish Rao Comments On BJP Policies on Handloom sector

ఏడేళ్లలో బీజేపీ నేత కార్మికులకు ఏం చేసిందో చెప్పాలి. ఊకదంపుడు ఉపన్యాసాలు కాదు. చేనేత కార్మికులు బీజేపీకి ఎందుకు ఓటు వేయాలో చెప్పాలని మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. హుజురాబాద్ లోని జమ్మికుంటలో నిర్వహించిన పద్మశాలిల సమావేశంలో ఆయన మాట్లాడారు. చేనేత కార్మికుల కోసం బీజేపీ ఒక్క పథకమైనా తెచ్చిందా? వారి సంక్షేమం కోసం ఎప్పుడైనా ఆలోచించిందా? నేత కార్మికుల ఓట్లు అడిగే నైతిక హక్కు బీజేపీకి లేదు. ఆ పార్టీ ఉన్న పథకాలు రద్దు చేస్తే.. టీఆర్ఎస్ కొత్త పథకాలు తెచ్చి నేతన్నలను ఆదుకుందని మంత్రి హరీష్ రావు అన్నారు. ఆలిండియా హ్యాండ్లూమ్ బోర్డును రద్దు చేసింది బీజేపీ పార్టీ కాదా అని ఆయన ప్రశ్నించారు. చేనేత కార్మికులకు లబ్ది చేకూర్చే అన్నీ కార్యక్రమాలను బీజేపీ రద్దు చేసింది. అలాంటి పార్టీకి ఓటు వేయొద్దు. హుజురాబాద్ లో ఆ పార్టీని రద్దు చేయాలి అంటూ హరీష్ రావు పిలుపునిచ్చారు. చేనేత కార్మికుల నోట్లో మట్టికొట్టిన పార్టీకి ఎందుకు ఓటేయాలి. బీజేపీ వాళ్లు మీటింగులు పెట్టి జనాలను రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తున్నారు. వారి మాటలు నమ్మొద్దని ఆయన కోరారు. ఆలిండియా హ్యాండీ క్రాఫ్ట్ బోర్డును, హ్యాండ్లూమ్ బోర్డులను ఎందుకు రద్దు చేసిందో బీజేపీ సమాధానం చెప్పాలని ఆయన నిలదీశారు. రద్దులు తప్ప చేనేత కార్మికులకు మీరు చేసిందేమిటి? నేత కార్మికులకు రద్దు చేసిన వాటి స్థానంలో ప్రత్నామ్నాయంగా ఏమిస్తారో హుజురాబాద్ లో ఓట్లు అడగడానికి వచ్చే కేంద్ర మంత్రులు చెప్పాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.

Minister Harish Rao Comments On BJP Policies on Handloom sector
Minister Harish Rao Comments On BJP Policies on Handloom sector

చేనేత కార్మికులు నేసిన ప్రతి వస్త్రాన్ని తెలంగాణ ప్రభుత్వం కొంటూ.. వారికి ఆర్థిక భరోసానిస్తోంది. మీటింగులు పెట్టి టీఆర్ఎస్ పై విమర్శలు చేయడం కాదు.. మీరు ఏం చేశారో చెప్పండి. మీరు ఎన్ని కుయుక్తులు పన్నినా.. నేత కార్మికులంతా టీఆర్ఎస్ వైపే ఉన్నారని మంత్రి హరీష్ అన్నారు. కుల, మత, వర్గాలకు అతీతంగా ప్రజలంతా టీఆర్ఎస్ వైపే ఉన్నారని.. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రజల మద్దతు తెరాసకే ఉంటుందని ఆయన అన్నారు. బీజేపీ నాయకులు కల్లబొల్లి మాటలు చెప్తూ.. అబద్ధాలు ప్రచారం చేస్తూ.. మోకాళ్ల మీద యాత్ర చేసినా హుజురాబాద్ లో గెల్లు శ్రీనివాస్ గెలుపును ఆపలేరు. ప్రజల నుంచి గెల్లుకు అపూర్వమైన స్పందన వస్తుంది. గెల్లు శ్రీనివాస్ బ్రహ్మాండమైన మెజారిటీతో గెలుస్తారు అని మంత్రి హరీష్ రావు ఆశాభావం వ్యక్తం చేశారు.