కనిపించే దేవుళ్ళు వైద్యులు.. వైద్యులంద‌రికీ సెల్యూట్‌

ఈ ప్ర‌పంచాన్ని ఆరోగ్య‌వంతంగా మార్చేందుకు వైద్యులు నిరంత‌రం శ్ర‌మిస్తున్నారని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఈ భూమిపై ప్రజల ప్రాణాలను కాపాడగలిగే శ‌క్తి వైద్యుల‌కు మాత్ర‌మే ఉన్న‌దని.. అందుకే వాళ్లు మ‌న‌కు క‌నిపించే దేవుళ్లని మంత్రి హరీశ్ కొనియాడారు. జూలై 1న జాతీయ వైద్యుల దినోత్సవం  సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.

‘‘కొవిడ్ మహమ్మారి సమయంలో వైద్య సిబ్బంది చూపిన తెగువను మాన‌వ స‌మాజం ఎప్పటికీ మరచిపోదు. ఇందుకు  #ThankYouDoctor అని చెప్తే మాత్ర‌మే స‌రిపోదు. వారి త్యాగాలను గౌర‌వించాలి. ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రులలోని వైద్యులకు పెద్ద ఎత్తున అభినంద‌న‌లు తెలుపాల్సి ఉన్న‌ది. వారు తమ శ‌క్తికి మించి, అందుబాటులో ఉన్న వనరులతో  రోగులకు ఉత్త‌మ వైద్యం అందిస్తున్నారు.

కొవిడ్ మ‌హ‌మ్మారి స‌మ‌యంలో ముందు వరుసలో నిలిచి ప్ర‌జ‌ల ప్రాణాల‌ను కాపాడిన వైద్యుల సేవ‌కు గుర్తింపుగా ఈ సంవ‌త్స‌రం “ఫ్యామిలీ డాక్టర్స్ ఆన్ ది ఫ్రంట్ లైన్” అనే థీమ్‌తో జాతీయ వైద్యుల దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం. రోగుల‌ను ఆరోగ్య‌వంతుల‌ను చేయ‌డానికి, ప్రజల ప్రాణాలను కాపాడ‌టానికి స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డుతున్న వైద్యులంద‌రికీ నా సెల్యూట్.

తెలంగాణ ఆరోగ్య రంగాన్ని దేశంలోనే నంబర్ వన్ గా నిలిపి, ప్రజలకు మరింత నాణ్యమైన వైద్య సేవలు అందించాలానే ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆకాంక్ష మేరకు అందరం కలిసి పనిచేయాలని కోరుకుంటున్నాను.’’ అని మంత్రి హరీశ్ చేసిన ట్వీట్ లో పేర్కొన్నారు.