ఏడేళ్లుగా కేంద్రం నుంచి సహకారం లేదు

Minister Harish Rao said the TRS party was going to win the Huzurabad by-election with a huge majority

ఏడేళ్లుగా కేంద్రం నుంచి సహకారం అందడం లేదన్నది కేసీఆర్ ఉద్దేశం.. అంతర్రాష్ట్ర జలాల్లో మా వాటా మాకు కావాలన్నదే మా ఉద్దేశమని మంత్రి హరీష్ రావు అన్నారు. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్ మీద మేం వ్యక్తిగతంగా మాట్లాడం లేదన్నారు. సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు.

నీటి వాటాపై సీఎం దృష్టి

అంతర్రాష్ట్ర జల వివాదాలకు సంబంధించి ఏదైనా రాష్ట్రం ఫిర్యాదు చేస్తే ఏడాదిలోగా పరిష్కరించాలి లేదా ట్రిబ్యునల్ కు రిఫర్ చేయాలి. రాష్ట్రం ఏర్పడిన 42 రోజుల్లోనే మేం కేంద్ర సర్కారుకు సెక్షన్ 3 కింద ఫిర్యాదు చేశాం. కొత్త రాష్ట్రంలో ఎన్ని సమస్యలున్నా మొదటి ప్రాధాన్యత గా నీటి వాటా పై సీఎం దృష్టి పెట్టారు. మా నిజాయితీని, చిత్తశుద్ధిని, తపత్రయాన్ని షెఖావత్ అర్థం చేసుకోవాలన్నారు.

కేంద్రం స్పందించక పోవడంతోనే కోర్టుకు వెళ్లాం

ఇప్పటి వరకు తుది నిర్ణయం కాలేదు.. మీరు నిర్ణయం తీసుకోకపోవడం వాస్తవం కాదా? అప్పటి నీళ్ల శాఖ మంత్రిగా అనేక సార్లు నేనే ఏడాది పాటు కేంద్రంతో సంప్రదింపులు చేశా. ట్రిబ్యునల్ కు రిఫర్ చేయాలని లీగల్ డిపార్టుమెంట్ చెప్పినా కేంద్రం పట్టించుకోలేదు. కేంద్రం స్పందించలేక పోవడం వల్లనే 13 నెలల తరువాత మేము సుప్రీంకోర్టు కు వెళ్ళాం. చట్ట ప్రకారంగా మీ దగ్గరికి వచ్చాము.. మీరు ఏడాది లోగా స్పందించ లేదని హరీష్ చెప్పారు.

రిఫర్ చేయడంలో అభ్యంతరం ఏమిటి?

సుప్రీం కు వెళ్లినా మీరు ట్రిబ్యునల్ కు రిఫర్ చేయడంలో అభ్యంతరం ఏమిటి? ఏడేళ్లుగా మీ వద్ద పెండింగ్ లో ఉన్నది వాస్తవం కాదా? మీ మాట మీద గౌరవం ఉంచి మీరు చెప్పినట్లు కేసును విత్ డ్రా చేసుకున్నాం. ఇప్పటికైనా కేంద్రం త్వరగా నిర్ణయం తీసుకోవాలి. మా ఆవేదన అంతా కృష్ణా జలాల్లో మా వాటా మాకు కావాలనేదే. మీరు నిర్ణయం తీసుకోవడం లేదు.. నిర్ణయం తీసుకొమ్మని చెప్పడానికే కోర్టుకు వెళ్ళామని మంత్రి హరీష్ రావు గుర్తు చేశారు.