కిషన్ రెడ్డి చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలే.. తక్షణమే క్షమాపణ చెప్పాలి

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు.. అబద్ధాలు మాట్లాడటంలో మిగతా బీజేపీ నేతలతో కిషన్ రెడ్డి పోటీ పడుతున్నారని మంత్రి తన్నీరు హరీష్ రావు మండిపడ్డారు. టీఆర్ఎస్ కార్యదర్శులు సోమ భరత్, ఎం.శ్రీనివాస్ రెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్ లతో కలిసి తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు.

ఎయిమ్స్ కు స్థలం ఇచ్చాం.. ఇదిగో జీవో

అబద్ధాలని మేము చెబుతున్నా సోషల్ మీడియాలో ఇంకా బీజేపీ నేతలు వాటిని ప్రచారం చేస్తున్నారు. వరి, సిలిండర్, కేసీఆర్ కిట్ ఇలా అన్ని అంశాల్లో బీజేపీ వి అబద్ధాలే. కిషన్ రెడ్డి మెడికల్ కళాశాలల విషయంలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఎయిమ్స్ కు బీబీ నగర్ లో మేము స్థలమే ఇవ్వలేదని బాధ్యతా రాహిత్యంగా మాట్లాడుతున్నారు. మేము నిమ్స్ కోసం స్థలం, భవనాన్ని ఏర్పాటు చేసుకుని ఎయిమ్స్ కు ఇచ్చాము. ఇలా ఇచ్చిన మొదటి రాష్ట్రం తెలంగాణే కావచ్చు. బీబీ నగర్ ఎయిమ్స్ కు 24 ఎకరాల స్థలమిచ్చాము.. ఇదిగో దానికి సంబంధించిన జీవో విడుదల చేస్తున్నామన్నారు.

గోబెల్స్ ను మించి పోయారు

ఇలా పచ్చి అబద్దాలు మాట్లాడిన కిషన్ రెడ్డి తక్షణమే క్షమాపణ చెప్పాలి.  గోబెల్స్ ను మించి పోతున్నారు బీజేపీ నాయకులు. మెడికల్ కళాశాల విషయంలో తెలంగాణ కేంద్రంతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరపలేదు అని కిషన్ రెడ్డి మరో పచ్చి అబద్ధం చెప్పారు. లక్ష్మారెడ్డి ఆరోగ్య మంత్రి గా ఉన్నపుడు ఎన్నో సార్లు ఢిల్లీ వెళ్లి మెడికల్ కళాశాలల గురించి మాట్లాడారు. ఫేస్ వన్, ఫేస్ టూలో కాలేజీలు ఇవ్వమని ఫేస్ త్రీ లో ఇస్తామని అప్పటి కేంద్ర మంత్రి హర్షవర్ధన్ హామీ ఇచ్చినా ఇప్పటికీ నెరవేరలేదు. మేము అడగక పోతే హర్షవర్ధన్ లేఖ ఎందుకు రాస్తారని ప్రశ్నించారు.

దమ్ముంటే విభజన హామీలను అమలు చేయించు

యూపీకి 27 మెడికల్ కాలేజీలు ఇచ్చి తెలంగాణకు ఇవ్వకపోవడం మా పట్ల సవతి తల్లి ప్రేమ, అవమానించడం కాదా? ఎయిమ్స్ మీరు ఇవ్వడం ఏమిటీ. అది విభజన చట్టం కింద ఇచ్చిన హామీ. కిషన్ రెడ్డికి దమ్ముంటే విభజన చట్టం కింద ఇచ్చిన హామీలు అమలు చేయించాలి. గతంలో తెలంగాణ ప్రజలకు ఎర్రబస్సు తప్ప ఏమీ తెలియదని కిషన్ రెడ్డి అవమానకరంగా మాట్లాడి అభాసు పాలయ్యారు. కిషన్ రెడ్డి పూర్తి సమాచారం తో మాట్లాడాలి.. మంచి టీం ను పెట్టుకోవాలి. నవోదయ స్కూళ్లు ఎందుకు ఇవ్వరని నిలదీశారు.

బీజేపీ నిజ స్వరూపం రైతులకు అర్థమైంది

ఈ రోజు బీజేపీ వాళ్ళు ఎందుకు ధర్నా చేసినట్టు… వారి ధర్నాలో రైతులు లేరు. రైతులకు బీజేపీ నిజ స్వరూపం అర్థమైంది. కిషన్ రెడ్డి యాసంగి గురించి మాట్లాడకుండా వానాకాలం ధాన్యం సేకరణ గురించి మాట్లాడుతున్నారు. పారా బాయిల్డ్ రైస్ వచ్చేదే యాసంగిలో.. కొంటామని కిషన్ రెడ్డి చెప్పాలి. బురద జల్లడమే బీజేపీ, కిషన్ రెడ్డి పనా? అని ప్రశ్నించారు.

చేతనయితే మెడికల్ కాలేజీలు తెప్పించు

కేంద్రం ఇవ్వకున్నా కేసీఆర్ కొత్త మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఐదు మెడికల్ కళాశాలలు ఉంటే ఇపుడు 21కి పెంచుకున్నాం. ఏడు వందల మెడికల్ సీట్లను నాలుగు వేలకు పెంచుకున్నాం. ఇంకా 12 మెడికల్ కళాశాలల అవసరం ఉంది. కిషన్ రెడ్డికి చేతనయితే ఆ మెడికల్ కళాశాలలు తెప్పించాలి. 40 శాతం నిధులు భరిస్తాం. నేను కిషన్ రెడ్డికి ఏ సమాచారం కావాలన్నా ఇస్తా. ఎపుడూ రమ్మన్నా వస్తా.. తెలంగాణ ప్రయోజనాలు మాకు ముఖ్యమన్నారు.

వడ్లను కొనేదాకా ఆందోళన కొనసాగుతది

రాజ్యాంగ బద్ధ పదవిలో ఉన్న కిషన్ రెడ్డి అబద్ధాలు మాట్లాడ కూడదు. కేంద్ర, రాష్ట్ర బీజేపీ నేతల మధ్య సమన్వయం లేదు. రేపటి ధర్నాలు ప్రారంభం మాత్రమే. వివిధ రూపాల్లో ఆందోళన కొనసాగుతుంది. బట్ట కాల్చి మీదెయ్యడం బురద జల్లడం మంచిది కాదు. కిషన్ రెడ్డి వడ్లన్నీ కొంటామని ఆర్డర్ తెస్తే ఎయిర్ పోర్టు కు వచ్చి సన్మానం చేస్తామన్నారు.

బీజేపీ అబద్ధాలను ప్రజలు నమ్మే స్థితిలో లేరు

బీజేపీ అబబ్ధాలు ఎల్ల కాలం నిలవవు. ప్రజలు బీజేపీ అబద్ధాలను నమ్మే స్థితిలో లేరు. పంజాబ్ లో కొంటారు.. ఇక్కడ ఎందుకు కోనరు. విదేశాంగ విధానం మార్చి బియ్యం ఎగుమతి నిబంధనలు మార్చండి. పారిశ్రామిక వేత్తలకు ఎన్నో సబ్సిడీలు ఇచ్చే కేంద్రం.. రైతులకు ఎందుకు ఇవ్వరు. నష్టాలు ఎందుకు భరించరు. కేంద్రం ధాన్యంపై యూ టర్న్ తీసుకోవడం వల్లే సమస్య అని హరీష్ అన్నారు.