మంత్రిగా ఉన్నప్పుడే పని చేయని ఈటెల.. ఇప్పుడు చేస్తారా?

Minister T Harish Rao formally inaugurated the state-wide baby fish distribution program

బీజేపీ ప్రభుత్వ రంగ సంస్థలన్నీ అమ్ముతోందని, ఉద్యోగాలను ఊడదీసి మన బిడ్డలను రోడ్డున వేస్తోందని మంత్రి హరీష్ రావు అన్నారు. కరీంనగర్ జమ్మికుంట పట్టణంలోని ఎంపీఆర్ గార్డెన్ లో కేడీసీసీ బ్యాంకు వైస్ చైర్మన్ పింగిళి రమేష్ టీఆరెస్ పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. హుజురాబాద్ ఎన్నిక ఎందుకు వచ్చింది.. ఎవరిని గెలిపిస్తే అభివృద్ధి జరుగుతుందో ఆలోచించాలన్నారు. ఈటెల తన స్వార్ధం కోసం ఎన్నిక తీసుకొచ్చారు. వ్యక్తికి లాభం కావాలా.. ప్రజలకు లాభం కావాలా ఆలోచించాలని కోరారు.

‘‘బీజేపీ గ్యాస్, పెట్రోల్, డీజిల్, వంట నూనె ధరలు పెంచింది. బావుల దగ్గర విద్యుత్ మోటార్లు పెడుతున్నందుకు ఓటేయాలా.. దొడ్డు వడ్లు కొనం అన్నందుకు బీజేపీకి ఓటేయలా? బొట్టు బిళ్లలతో ఓట్లు కొనుక్కోవడం సరైనదా. సీఎం కేసీఆర్ 5 వేల ఇండ్లు ఇస్తే ఈటెల కట్టించలేదు. కేంద్రమంత్రి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వచ్చాయా అని అడిగారు.. ఆ మాట ఈటెలను అడగాలి. మంత్రిగా ఉన్నప్పుడే పని చేయని ఈటెల.. ఇప్పుడు చేస్తారా?

ఈటెల గెలిచే ప్రశ్నే లేదు. ఒక వ్యక్తికి లాభం చేయడం కోసం హుజురాబాద్ ప్రజలు త్యాగం చేయాలా. హుజురాబాద్ లో ఒక్క మహిళా భవనం లేదంటే.. ఊరూరికి కట్టిస్తున్నాం.. అది తప్పా. ఈటెల కట్టకుండా ఉంచిన ఇళ్లను కట్టించడం తప్పా. ఈటెల రాజేందర్ ఎందుకు సహనం కోల్పోతున్నాడో అర్ధం కావడం లేదు. ఈటెల ఎంత రెచ్చగొట్టినా.. మాది మాత్రం ప్రజలకు సేవ చేసే మార్గం.

పనిచేసే టీఆర్ఎస్ ను గెలిపించుకుందాం. రెండు కళ్ళలా మీకు గెల్లు శ్రీనివాస్ యాదవ్, పాడి కౌశిక్ రెడ్డి ఉన్నారు. ఓటు మీరు వేయండి.. రెండున్నరేళ్లు మేము సేవ చేస్తాం. ఏం చెప్పి బీజేపీ నేతలు ఓట్లు అడుగుతారో చెప్పాలి. బీజేపీ నేతలు మాయ మాటలు చెబుతున్నారు. గెల్లు శ్రీనివాస్ యాదవ్ 20 ఏళ్ళు కష్టపడ్డాడు. మీకు ఎప్పుడు ఆపద వచ్చినా మీకు అండగా ఉంటాడు. కల్లబొల్లి మాటలు చెప్పే వాళ్లు కాదు.. పని చేసే వాళ్ళు కావాలి.’’ అని హరీష్ రావు అన్నారు.

మీ తలలో నాలుకలా పనిచేస్తా..

గెల్లు శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. కేసులకు భయపడకుండా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నందుకే నాకు సీఎం కేసీఆర్ టికెట్ ఇచ్చారు. తెలంగాణ వచ్చింది కాబట్టే మన బతుకులు మారాయి. తెలంగాణ రాకముందు ఇప్పుడిచ్చే సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయా. మీ తలలో నాలుకలా పనిచేస్తా.. మీకెప్పుడు అందుబాటులో ఉంటా. నియోజకవర్గంలో ఇల్లు లేని ప్రతి నిరుపేదకు ఇల్లు కట్టిస్తానన్నాడు.

బీజేపీ వైపు ప్రజలు లేరు

ఎమ్మెల్యే అరూరి రమేష్ మాట్లాడుతూ.. 5 సంవత్సరాల కోసం హుజురాబాద్ ప్రజలు ఆశీర్వదిస్తే వ్యక్తిగత స్వార్ధం కోసం రాజీనామా చేశారు. ఈటెల వెనుక ఎవరూ లేరు.. అందరూ మళ్లీ కన్నతల్లి టీఆర్ఎస్ లో చేరుతున్నారు. బీజేపీ వైపు ప్రజలు లేరు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుంది. మాయమాటలు చెప్పే బీజేపీ మాటలను నమ్మొద్దన్నారు.

అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తాం

పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. మీ ఉత్సాహం చూస్తుంటే ఈటెలకు డిపాజిట్ రాదని అర్ధమవుతుంది. ప్రజలు కష్టాల్లో ఉంటే పరమర్శించడానికి వెళ్తే ఈటెల నన్ను విమర్శిస్తున్నారు. డ్రైనేజీ కూడా కట్టించని దద్దమ్మ ఈటెల. ఈటెల రాజేందర్ అభివృద్ధి మేకప్ వేసినట్టు ఉంది. ఒక్క అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తాం. హరీష్ రావు సిద్దిపేటను ఎలా అభివృద్ధి చేశారో.. హుజురాబాద్ ను అలా అభివృద్ధి చేస్తారన్నారు.

ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, నన్నపనేని నరేందర్, మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వరరావు ఉన్నారు.