బండి సంజయ్ ఎంపీ అయ్యాక ఎక్కడైనా రెండు లక్షల పనైనా చేశాడా?: మంత్రి హరీష్ రావు

ప్రభుత్వ రంగ సంస్థలను బీజేపీ ప్రభుత్వం అమ్ముతున్నది.. మరోవైపు ఏ రాష్ట్రంలో ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మితే ఆయా రాష్ట్రాలకు బహుమానం ఇస్తానంటున్నదని మంత్రి హరీష్ రావు మండిపడ్డారు.  ప్రభుత్వ సంస్థలను అమ్మే ప్రభుత్వం వైపు ఉందామా? ఆస్తులను కాపాడే టీఆర్ఎస్ ప్రభుత్వం తరపున ఉండాలో ఆలోచించాలని మంత్రి పిలుపునిచ్చారు.

కరీంనగర్ జిల్లా హుజరాబాద్ నియోజక వర్గ స్థాయి విశ్రాంత ఉద్యోగులతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి హరీష్ రావు, పెద్దిరెడ్డి, గేల్లు శ్రీనివాస్, బండ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ రావాలని ఉద్యమంలో పాల్గొన్న మిమ్మల్ని మరచిపోము. ఆచార్య జయశంకర్ తుది శ్వాస వరకు తను కోరుకున్న తెలంగాణ కోసం కొట్లాడే వ్యక్తి కేసీఆర్. తొమ్మిది నెలల్లోనే అన్ని పారిశ్రామిక రంగాలకు రైతులకు నాణ్యమైన కరెంట్ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ఈ రోజు అదనపు విద్యుత్ ను పక్కరాష్ట్రాలకు అమ్మే స్థాయికి ఎదిగినం. కాళేశ్వరం నీళ్లు వస్తాయా అని ఆనాడు అన్నారు. తొలి కాళేశ్వరం చుక్క హుజురాబాద్ కే అందింది.

దేశంలో అత్యధికంగా వడ్లు పండించే రాష్ట్రంగా ఇప్పుడు తెలంగాణ నిలిచి దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ రాష్ట్రం ఎదిగింది. అన్ని రంగాల్లో రాష్ట్రం గుణాత్మకంగా ఎదిగింది. మొదటి దశ, రెండవ దశ కరోనాతో నష్టం వాటిల్లింది. బీజేపీ ప్రభుత్వం పదేండ్లకు ఏడున్నర శాతం ఫిట్మెంట్ ఇస్తే.. తెలంగాణ 30 శాతం ఫిట్మెంట్ ఇచ్చింది.

సింగరేణి ఉద్యోగులకు ఆసరా పెన్షన్ కి ముఖ్యమంత్రి తో చర్చించి పెన్షన్ వచ్చేటట్లు చేస్తా. ఆర్టీసీ వ్యాపార సంస్థ కాదు, పేదలకు అన్నం పెట్టే సంస్థ. మా గెల్లు శ్రీనివాస్ కు మీ ఆశీర్వాదం ఇవ్వండి. బీజేపీ గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు పెంచింది. గ్యాస్ సబ్సిడీ తగ్గించింది. రైతుల వ్యవసాయ భావుల దగ్గర మోటర్లకు మీటర్లు పెడతానని బీజేపీ అంటుంది.

బండి సంజయ్ ఎంపీ అయ్యాక ఎక్కడైనా రెండు లక్షల పనైనా చేశాడా. నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నడు.. ఆయన విజ్ఞతకే వదిలేస్తున్న. ఓక వ్యక్తి ప్రయోజనం కంటే హుజురాబాద్ ప్రజల ప్రయోజనం గొప్పది. పార్టీ కోసం, ఉద్యమం కోసం పోరాడిన వ్యక్తి గెల్లు శ్రీను. ఆయన ఆస్తి క్రమశిక్షణ. గెల్లు శ్రీను ను గెలిపించి ముఖ్యమంత్రికి బహుమానంగా ఇవ్వాలి.’’ అని అన్నారు.