సీఎం కేసీఆర్ వల్లనే గురుకులాలకు గొప్ప పేరు - TNews Telugu

సీఎం కేసీఆర్ వల్లనే గురుకులాలకు గొప్ప పేరు



minister Harish rao  inaugurated a residential tribal law college in Sangareddy district along with Minister Satyavathi Rathod

సీఎం కేసీఆర్ వల్లనే రాష్ట్రంలో రెసిడెన్షియల్ స్కూల్స్ లో మంచి విద్య లభిస్తుందని, ఆయన కృషిని ప్రతి గురుకుల స్కూల్, కాలేజ్ ల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోవాలని మంత్రి హరీష్ రావు అన్నారు. సంగారెడ్డి జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేసిన రెసిడెన్షియల్ గిరిజన లా కాలేజ్ ను మంత్రి సత్యవతి రాథోడ్ తో కలసి హరీష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలోనే తొలి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ లా కాలేజ్ ను సంగారెడ్డిలో ఏర్పాటు చేయడం సంతోషం ఉందని అన్నారు. ఈ కాలేజీ దేశానికే ఆదర్శంగా పేరు తెచ్చుకోవాలన్నారు. తెలంగాణ రాకముందు గురుకుల విద్యా కు 70 కోట్లు మాత్రమేనని, సీఎం కేసీఆర్ చొరవతో ప్రస్తుతం 570 కోట్లు కేటాయించారని చెప్పారు.

తెలంగాణ లో గురుకులాలు గొప్ప పేరు తెచ్చుకున్నది సీఎం కేసీఆర్ ఆలోచన వల్లనేనని హరీష్ అన్నారు. గిరిజన విద్యార్థుల చదువు కోసం తెలంగాణ ప్రభుత్వం 570 కోట్లు ఖర్చు చేస్తుందని చెప్పారు. సీఎం కేసీఆర్ చొరవతో తెలంగాణ లో పేద విద్యార్థుల చదువుల కోసం రెసిడెన్షియల్ స్కూల్స్, కాలేజీ లను ప్రారంభించామన్నారు. ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు . గురుకుల పాఠశాలల్లో, కాలేజీ లలో అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ చేస్తున్న కృషిని తప్పకుండా తల్లిదండ్రులకు చెప్పాలన్నారు.

మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ చొరవతో గిరిజన విద్యార్థుల కోసం 22 రెసిడెన్షియల్ గిరిజన డిగ్రీ కాలేజ్ లను ఏర్పాటు చేశామని చెప్పారు. గిరిజన పిల్లల చదువుల కోసం ప్రత్యేక చొరవ తీసుకున్నామన్నారు. ప్రభుత్వమే గిరిజనుల విద్యార్థుల కోసం ఐ ఎ ఎస్ కోచింగ్ ఇప్పిస్తున్నదని తెలిపారు. బడ్జెట్ లో గిరిజన సంక్షేమం కోసం 2600 కోట్లు కేటాయించామని మంత్రి తెలిపారు.

ఈ కార్యక్రమలో పాల్గొన్న ఎంపీలు కొత్త ప్రభాకర్ రెడ్డి, బి.బి. పాటిల్, ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, జడ్పీ చైర్ పర్సన్ మంజు శ్రీ రెడ్డి, గురుకుల సెక్రటరీ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.