నార్మల్ డెలివరీ చేయిస్తే ఇన్సెంటివ్

  • త్వరలోనే పీహెచ్‎సీలలో సీసీ కెమెరాలు
  • ఆపరేషన్లు తగ్గించి.. నార్మల్ డెలివరీలు ప్రోత్సహించాలి
  • వైద్యరంగంలో రాష్ట్రాన్ని దేశానికి రోల్ మోడల్ చేయాలె

జగిత్యాల జిల్లాలో మంత్రి హరీశ్ రావు పర్యటిస్తున్నారు. జిల్లా కేంద్రంలో రూ. 17 కోట్లతో నిర్మించిన జనరల్ ఆస్పత్రి, మాతా శిశు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే సంజయ్, సుంకె రవిశంకర్, విద్యాసాగర్ రావు, ఎమ్మెల్సీ ఎల్ రమణ పాల్గొన్నారు.

కరోనా సమయంలో ఎంతో కష్టపడిన ఏఎన్ఎమ్ లకు కృతజ్ఞతలు. ఆశా కార్యకర్తలు ఇంటింటికీ సర్వే చేయడంతో ద్వారా శ్రమ తగ్గింది. మనం చేసిన పనిని నీతి ఆయోగ్ మెచ్చుకొని.. మిగతా రాష్ట్రాలు కూడా పాటించాలని సూచించింది. తెలంగాణ రాకముందు ఆశాకార్యకర్తలకు రూ. 1500 జీతం ఉంటే.. కేసీఆర్ ఆ జీతాన్ని రూ. 9, 750కి పెంచారు. ప్రధాని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్‎లో రూ. 4 వేలు, కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్థాన్‎లో రూ. 3 వేలు మాత్రమే. ఇంకా బాగా పనిచేసి.. మన ఆశాల జీతాలు మరింత పెంచుకుందాం.

ప్రభుత్వ ఆస్పత్రులలో ప్రసవాల శాతం 44గా ఉంది. కేసీఆర్ కిట్ వచ్చిన తర్వాత కూడా మిగతా 56 శాతం మంది ప్రైవేట్ ఆస్పత్రులకు ఎందుకు పోతున్నారో అర్థం కావడంలేదు. దీనికి సమాధానం చెప్పాలె. కొత్త రాష్ట్రం రాకముందు ప్రభుత్వ దవాఖానాలలో కేవలం 30 శాతం మాత్రమే జరిగేవి. కేసీఆర్ కిట్ వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆస్పత్రులలో 56 శాతం ప్రసవాలు జరుగుతున్నాయి. కాబట్టి జగిత్యాల జిల్లాలో ప్రభుత్వ ఆస్పత్రులలోనే ప్రసవాలు జరిగేలా చూడాల్సిన బాధ్యత ఆశా కార్యకర్తలది, ఏఎన్ఎంలదే. జగిత్యాల జిల్లా ప్రభుత్వ ఆస్పత్రులలో సాధారణ ప్రసవం కాకుండా.. ఆపరేషన్లు ఎక్కువ చేస్తున్నారు. రాష్ట్రం మొత్తం మీద 60 శాతం ఆపరేషన్లు చేస్తే.. జగిత్యాలలో 80 శాతం ఆపరేషన్లు చేస్తున్నారు. దీని ద్వారా తల్లీబిడ్డ ఆరోగ్యం దెబ్బతింటుంది. అందుకే ఆపరేషన్లు తగ్గించి.. నార్మల్ డెలివరీ చేయడానికే ప్రాధాన్యత ఇవ్వాలి. నార్మల్ డెలివరీ చేస్తే ఆశా కార్యకర్తకు, ఏఎన్ఎంకు, డాక్టర్ కు ఇన్సెంటివ్ ఇచ్చే ఆలోచన కూడా చేస్తున్నాం. గతంలో ప్రభుత్వ ఆస్పత్రిలో డెలివరీ అయితే రూ. 12 వేలు ఇచ్చి, కేసీఆర్ కిట్ ఇచ్చేవాళ్లం. ఇక నుంచి ప్రభుత్వ ఆస్పత్రిలో నార్మల్ డెలివరీ అయితే ఆశా కార్యకర్తకు, ఏఎన్ఎంకు, డాక్టర్‎కు, స్టాఫ్ నర్స్‎కు ఇన్సెంటివ్ వచ్చేలా ప్లాన్ చేస్తాం.

గత 75 ఏండ్లలో రాష్ట్రంలో మూడే ప్రభుత్వ కాలేజీలు ఉండేవి. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కేవలం ఏడేండ్లలోనే కేసీఆర్ 33 కాలేజీలు ఏర్పాటు చేశారు. గతంలో తెలంగాణలో 700 మెడికల్ సీట్లు మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు 2840 సీట్లు వచ్చాయి. ఆస్పత్రుల సేవలలో తెలంగాణ దేశంలో మూడో స్థానంలో ఉందని కేంద్రమే చెప్పింది. అదే బీజేపీ సర్కార్ ఉన్న ఉత్తర‎ప్రదేశ్ వైద్యసేవలలో చివరి స్థానంలో ఉంది. తెలంగాణ రాకముందు రాష్ట్రంలో ఉస్మానియా, గాంధీ, వరంగల్ ఎంజీఎంలలో మాత్రమే డయాలసిస్ సెంటర్లు ఉండేవి. కానీ, ఇప్పుడు ఆ సంఖ్య 102కు పెరిగింది. త్వరలోనే కోరుట్లతో పాటు చొప్పదండికి కూడా డయాలసిస్ సెంటర్లకు అనుమతులిస్తాం. రాష్ట్రం రాకముందు 200 ఉన్న ఐసీయూ బెడ్ల సంఖ్యను ఆరువేలకు పెంచుకున్నాం. రాష్ట్రం మొత్తం మీద రూ. 403 కోట్లతో 22 మదర్ అండ్ చైల్డ్ కేర్ ఆస్పత్రులను ఏర్పాటుచేశాం. పాతవి ఆరు, కొత్తవి 22 మొత్తం కలిపి 28కి చేరుకున్నాయి. కాబట్టి జగిత్యాల జిల్లాలో ప్రభుత్వ ఆస్పత్రులలో కాన్పుల సంఖ్య పెరగాలి. నార్మల్ డెలివరీలకే మొగ్గుచూపాలి. రాష్ట్ర ప్రభుత్వం ఆస్పత్రులు ఏర్పాటు చేస్తుండటంతో కొన్ని జిల్లాల్లో ప్రైవేట్ ఆస్పత్రులు మూతపడుతున్నాయి. కళ్యాణలక్ష్మీ చెక్కులు ఇచ్చేటప్పుడే తల్లుల నుంచి వాగ్దానం చేయించుకుంటున్నాం. కూతురుకి ప్రభుత్వ ఆస్పత్రిలోనే నార్మల్ డెలివరీ చేయించాలని సూచిస్తున్నాం.

త్వరలోనే అన్ని పీహెచ్‎సీలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం. డాక్టర్లు కచ్చితంగా సమయపాలన పాటించాలి. అదేవిధంగా ప్రతిజిల్లాకో రేడియాలజీ ల్యాబ్‎ను త్వరలోనే ఏర్పాటుచేస్తాం. తల్లీబిడ్డ మరణాల సంఖ్య బాగా తగ్గేలా చేసి రెండోస్థానంలో నిలిచాం. పేషంట్లకు ఇచ్చే భోజనం ఖర్చును రూ. 40 నుంచి రూ. 80కి పెంచాం. శానిటేషన్ వర్కర్లకు జీతం ప్రతి మంచానికి రూ. 7500కు పెంచుతాం. సర్కార్ దవాఖానాలో మందులు లేవు అనే మాట వినిపించొద్దు. మందుల కోసం బయటకు రాస్తే.. డాక్టర్ మీద తెల్లారేసరికి చర్యలు తీసుకుంటాం’ అని మంత్రి హరీశ్ రావు హెచ్చరించారు.