ఈటెల మాటలను.. వ్యవహార శైలిని సమాజం హర్షిస్తుందా..: మంత్రి హరీష్ రావు

ఈటెల రాజేందర్ కు టీఆర్ఎస్ అన్ని రకాలుగా న్యాయం చేసింది.. ఏ విషయంలోనూ అన్యాయం చేయలేదని మంత్రి హరీష్ రావు అన్నారు. ఆనాడు ముద్దసాని దామోదర్ పై సీఎం కేసీఆర్ అవకాశం ఇచ్చినప్పుడు ఈటెల స్థాయి ఎంతో మీ అందరికి తెలుసు.. ఈటెలను అంచెలంచెలుగా ఈ స్థాయికి తెచ్చింది సీఎం కేసీఆరా కాదా ఆలోచించాలన్నారు.

కరీంనగర్ జమ్మికుంట పట్టణంలోని స్వాతి గార్డెన్ ఫంక్షన్ హాల్ లో ఆర్యవైశ్యుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. దీనికి మంత్రి హరీష్ రావు, మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే కోరుకంటి చందర్, రాష్ట్ర పోలీస్ హౌసింగ్ బోర్డ్ చైర్మన్, పాడి కౌశిక్ రెడ్డి, జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వరరావు హాజరయ్యారు.

ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. ‘‘2001లోనే ఈ ప్రాంతంలో బలమైన పార్టీగా టీఆర్ఎస్ ఉంది. ఈటెల స్థాయిని పెంచింది సీఎం కేసీఆర్. కరీంనగర్ జిల్లాపై ప్రేమతో  శాలపల్లిలోనే రైతుబంధు ప్రారంభించారు. రైతు బంధు ప్రారంభోత్సవం సందర్భంగా ఈటెల కుడి భుజం అని ఎంతో గొప్పగా చెబితే.. కేసీఆర్ నీకు ఘోరీ కడతా అని ఈటెల అంటున్నాడు. రాజకీయంగా అక్షరాలు నేర్పిన కేసీఆర్ గురించి అలా మాట్లాడితే ఈటెలకు ప్రజల్లో ఏ రకంగా విశ్వాసం ఉంటుందా. కేసీఆర్ లేకుండా ఈటెల ఈ స్థాయికి వచ్చేవాడా ఆలోచించాలి. ఈటెల మాటలను.. వ్యవహార శైలిని సమాజం హర్షిస్తుందా. కేరళ నుంచి భాష రాని కేంద్ర మంత్రి మురళీధర్ రావొచ్చు గానీ.. రాష్ట్ర మంత్రిగా హరీష్ రావు మాత్రం ఇక్కడికి వచ్చి మాట్లాడొద్దా? అన్ని అవకాశాలు ఇచ్చి గౌరవిస్తే.. జమ్మికుంట, హుజురాబాద్ ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడుతున్నాడు.

 7 ఏళ్ళు మంత్రిగా ఉండి  చేయలేని వాళ్ళు.. ప్రతిపక్షంలో ఉండి చేస్తారా..

హుజురాబాద్ లో ప్రజల ఆశీస్సులతో గెలిచేది టీఆర్ఎస్ పార్టీ. ప్రభుత్వంగా పనిచేస్తుంటే.. తన తప్పిదాన్ని కప్పిపుచ్చుకునే విధంగా మాట్లాడుతున్నాడు. మంత్రులందరూ 4 వేల ఇండ్లు పూర్తి చేస్తే.. పేదల పట్ల నిర్లక్ష్యంతో ఒక్క ఇల్లు కట్టలేదు. 7 ఏళ్ళు మంత్రిగా ఉండి  చేయలేని వాళ్ళు.. ప్రతిపక్షంలో ఉండి చేస్తారా. 10 శాతం ఈబీసీ రిజర్వేషన్లను సులభతరంగా ఇచ్చిన ప్రభుత్వం మాది. పేదరికానికి కులం అడ్డుకావొద్దని కళ్యాణ లక్ష్మీ, కేసీఆర్ కిట్, ఆసరా పెన్షన్ ఇస్తున్నాం. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు వైశ్య కార్పొరేషన్ ఏర్పాటవుతది.. కరోనా వచ్చి కొంత ఆలస్యమైనా ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది.

 రాజకీయంగా వైశ్యులకు పెద్ద పీట

రాజకీయంగా వైశ్యులకు పెద్ద పీట వేసింది టీఆర్ఎస్ పార్టీ. పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తాం. ఒక్కసారి గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు అవకాశం ఇవ్వండి.. మాటల్లో కాదు.. చేతల్లో చేసి చూపిస్తాం. నేను బాధ్యత తీసుకుంటా.. ముఖ్యమంత్రి కేసీఆర్ అండగా ఉంటారు. పెరిగిన పెట్రోల్, డీజిల్, సిలిండర్ ధరలకు బీజేపీ కారణం కాదా.. జీఎస్టీ తో వ్యాపార వర్గాలు ఇబ్బందికి, ఒత్తిడికి గురి కావడం లేదా? కేంద్రంతో ప్రజలు, వ్యాపారస్థులకు ఎలాంటి సహకారం దొరకదు.

మోసపూరిత మాటలు నమ్మొద్దు

ఏడేళ్లలో రాష్ట్రంలో గుణాత్మక మార్పులు వచ్చాయి. జరుగుతున్న పనులు ఇంకా వేగంగా జరగాలంటే టీఆర్ఎస్ ను గెలిపించుకోవాలి. బండి సంజయ్ ఎంపీగా గెలిచిన రెండున్నరేళ్లలో ఒక్క పనైనా చేశారా. ప్రలోభాలకు.. మోసపూరిత మాటలు నమ్మొద్దు.. పని చేసే ప్రభుత్వానికి అండగా ఉండండి.’’ అని మంత్రి హరీష్ రావు అన్నారు.

ఓటు వేయడమే కాదు.. పది మందితో ఓటు వేయిద్దాం

రాష్ట్ర పోలీస్ హౌసింగ్ బోర్డ్ చైర్మన్ కోలేటి దామోదర్ మాట్లాడుతూ.. స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ పార్టీ కూడా వైశ్యులను పట్టించుకోలేదు. సీఎం కేసీఆర్ రాజకీయంగా, ఆర్ధికంగా వైశ్యులకు ఎన్నో అవకాశాలు కల్పించారు. గతంలో వైశ్యులకు గుంట భూమి అయినా ఇచ్చారా. హుజురాబాద్ లో వైశ్యులకు ఎకరం స్థలం.. రూ. కోటి కేటాయించారు.. దానికి సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావు కారణం. వీణవంక, ఇల్లందకుంటకులో కూడా స్థలం ఇస్తామని హామీ ఇచ్చారు. అనేక కార్యక్రమాలు చేస్తున్న టీఆర్ఎస్, సీఎం కేసీఆర్ ను ఆశీర్వదించాలి.. గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను భారీ మెజారిటీతో గెలిపించాలి. ఒక వైశ్యుడు వంద మందితో సమానం.. మనం ఓటు వేయడమే కాదు.. పది మందితో ఓటు వేయిద్దాం.. టీఆర్ఎస్ కు అండగా నిలిచి కృతజ్ఞత చాటుదాం.. సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుద్దామని పిలుపునిచ్చారు.

వ్యాపారస్థులందరికీ రక్షణ కవచంగా నిలుస్తా..

అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఉద్యమకారుడిగా అవకాశం ఇచ్చారు. జమ్మికుంట మరింత అభివృద్ధి చెందాలంటే మీరంతా అండగా ఉండాలి. నన్ను ఆశీర్వదిస్తే.. వ్యాపారస్థులందరికీ రక్షణ కవచంగా నిలిస్తానని భరోసానిచ్చారు.