మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు.. రేపటి నుంచి జమ

కరీంనగర్ జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో మహిళా సంఘాల సమావేశం.. స్త్రీ నిధి రుణాల పంపిణీ, వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమం. మంత్రి హరీష్ రావు, జెడ్పీ ఛైర్ పర్సన్ విజయ, మాజీ మంత్రి పెద్ది రెడ్డి హాజరై లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. మహిళా సంఘాలకు సంబంధించి వడ్డీలేని రుణాలు మీ ఖాతాల్లో రేపటి నుంచి జమ చేస్తున్నాం. 2.34 కోట్ల వడ్డీలేని బ్యాంక్ లింకేజీ రుణాలు జమ్మికుంట మహిళ సంఘాలకు అందిస్తున్నామన్నారు. స్త్రీ నిధి పథకంలో వడ్డీలేని రుణం కింద కోటి 84 లక్షలు మీ ఖాతాల్లో జమచేస్తున్నాం. ఇవి కాకుండా కొత్తగా 10 కోట్ల బ్యాంకు లింకేజీ, మరో కోటి రూపాయలు స్త్రీనిధి కింద లోన్లు మంజూరు చేస్తున్నామన్నారు.

మహిళలకు ఆర్థిక భరోసా

తెలంగాణ వచ్చాక.. మహిళలకు 5 లక్షల పైన రుణాలు సకాలంలో అందిస్తున్నాం. మైక్రోఫైనాన్స్, వడ్డీ వ్యాపారుల బెడద లేకుండా మహిళలకు ఆర్థిక భరోసా ఇస్తోంది ప్రభుత్వం. వడ్డీలేని రుణం కింద రాష్ట్రవ్యాప్తంగా మంజూరు చేసేందుకు బడ్జెట్ లో 3 వేల కోట్లు పెట్టాం. ప్రభుత్వం ఏ లబ్ధి అందించినా.. మహిళల పేర్లపైనే ఇస్తున్నాం. కల్యాణలక్ష్మి పథకం మొదట్లో ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చాం. ఇప్పుడు అన్ని కులాల్లోని నిరుపేదలకు రూ. లక్షా 116  ఇస్తున్నామన్నారు.

‘నేను పోతా సర్కారు దవాఖానకు’

కల్యాణ లక్ష్మి డబ్బులు అత్తవారికి చెందకుండా.. వధువు తల్లిపేరుతో ఇస్తున్నాం. ప్రభుత్వ ఆస్పత్రులను బలోపేతం చేయడంతో పాటు.. మగపిల్లాడు పుడితే 12 వేలు, ఆడపిల్ల పుడితే 13 వేలతోపాటు, కేసీఆర్ కిట్టు అందిస్తున్నాం. టీడీపీ, బీజేపీ పొత్తుల ప్రభుత్వం నడిపినప్పుడు సర్కారు దవాఖానకు పోవాలంటే భయపడేవారు. “నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు” అనే… పాటను నేడు.. “నేను పోతా సర్కారు దవాఖానకు” అనేలా మార్చామన్నారు.

అత్తలే .. కోడళ్లకు ఆసరా

57 ఏళ్లు నిండిన వాళ్లకు ఫించను ఇస్తామన్న హామీ కరోనా వల్ల ఆలశ్యమైంది. ఇచ్చిన మాట ప్రకారం 1-2 నెలల్లోనే అందరికీ ఇస్తాం. ఆసరా ఫించను పుణ్యామా అని కోడళ్లు అత్తలను బాగా చూసుకుంటున్నారు. అత్తలే .. కోడళ్లకు ఆసరాగా మారారు. తెలంగాణ రాకముందు కరెంటు, సాగునీటి పరిస్థితి ఎలా ఉండేది.. ఇప్పుడెలా ఉందన్నది మీకు తెలుసు కదా అని ప్రశ్నించారు.

పది రోజుల్లాగా రైతు రుణాలన్నీ మాఫీ.. మరో 50వేల ఉద్యోగాల ప్రకటన

వారం, పది రోజుల్లాగా.. 50 వేల వరకు ఉన్న రైతు రుణాలన్నీ మాఫీ చేస్తున్నాం. మార్చి తర్వాత లక్ష వరకు ఉన్న రుణాలు మాఫీ వడ్డీతో సహా మాఫీ చేస్తాం. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కూడా ఇవ్వాల్సి ఉంది.  అవి కూడ గత మంత్రి ఈటెల నిర్లక్ష్యం వల్ల పూర్తి చేయలేదు. కేసీఆర్ రాష్ట్రం వస్తే జైత్ర యాత్ర, లేకపోతే నా శవ యాత్ర అని కేసీఆర్ ఉద్యమానికి బయలుల్దేరాడు. ఆలాంటి కేసీఆర్ సత్తా మీకందరికీ తెలుసు.. అనుకున్నవన్నీ చేస్తారు. గతంలో ఇక్కడ ఒక్క మహిళ భవనం లేదు.  రూ.3కోట్లతో 20 గ్రామాల్లో 20మహిళ భవనాలు మంజూరు చేశాం. త్వరలో మరో 50వేల ఉద్యోగాలు ప్రకటించ బోతున్నామన్నారు.