దళితబంధును పథకంలా కాకుండా ఉద్యమంగా చూడాలి

హైదరాబాద్: దళితబంధును ఒక పథకంలా కాకుండా ఉద్యమంగా చూడాలని వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. దళితబంధు పథకం మొదలై ఏడాది పూర్తైన సందర్భంగా సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలం బుడ్డాయిపల్లి గ్రామానికి చెందిన దళితబంధు లబ్ధిదారులు ఆయనను కలిశారు. దళితబంధుతో తమ జీవితాలు మారాయంటూ.. ఊరినుంచి తెచ్చిన జున్నుపాలను మంత్రికి అందజేసి సంతోషం వ్యక్తం చేశారు. దళితబంధు పథకం ద్వారా మంజూరైన బర్రెల యూనిట్లు సత్ఫలితాలను ఇవ్వడం పట్ల మంత్రి హరీష్ రావు సంతోషం వ్యక్తం చేస్తూ.. భవిష్యత్తులో దళితులు మరింత రాణించాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ తో కలిసి వచ్చిన దళితబంధు లబ్ధిదారులు.. లక్డికాపూల్ అరణ్య భవన్‎లో మంత్రి హరీష్ రావును కలిశారు.

ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. ‘దళితబంధు ప్రారంభమైన నాడు అనేక అపోహలు ఉండేవి. ఇవాళ అన్ని నియోజకవర్గాల్లో దళితబంధు పథకం అమలవుతోంది. దశలవారీగా రాష్ట్రంలోని దళితులందరికీ దళితబంధు పథకం అందించాలన్నది సీఎం కేసీఆర్ సంకల్పం. దేశంలో ఎక్కడా లేనివిధంగా విప్లవాత్మకమైన ఉద్యమానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారు. దళితబంధు పథకాన్ని ఒక పథకంగా కాకుండా ఉద్యమంగా చూడాలి. అన్ని కాంట్రాక్టుల్లో దళితులకు రిజర్వేషన్లు ఇస్తున్నాం. ప్రతి రంగంలో దళితులకు పెద్దపీట వేస్తున్నాం’ అని మంత్రి హరీష్ రావు అన్నారు.

దళితబంధు పథకం దళితుల జీవితాల్లో మార్పుకు నాంది
దళితబంధు పథకం దళిత వర్గాల జీవితాల్లో మార్పుకు నాంది పలికింది. దళితబంధు తాత్కాలికమని, ఎలక్షన్ల కోసం తీసుకువచ్చారని అపోహలు సృష్టించారు. హుజురాబాద్ ఎలక్షన్స్‎కు ముందే ప్రతి దళిత కుటుంబానికి రూ. 10 లక్షలు ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ప్రతిపక్షాలకు పుట్టగతులు ఉండవనే దళితబంధుపై అపోహలు లేవనెత్తారు. దళితబంధు లబ్ధిదారులు విజయవంతమయ్యారు. దళితబంధును దేశమంతా అమలు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాం. 75 ఏళ్లుగా అనేక ప్రభుత్వాలు పేదల జీవితాల్లో మార్పు కోసం కృషి చేస్తున్నామని మాటలు చెప్పాయి తప్ప పనులు చేయలేదు’ అని ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ అన్నారు.