రాష్ట్ర మంత్రి హరీష్ రావు అడగ్గానే సిద్దిపేట జిల్లా సీటీ స్కానింగ్ కేంద్రాల నిర్వాహకులు సీటీ స్కానింగ్ ధరలు సగానికి తగ్గిస్తున్నట్టు నిర్ణయం తీసుకున్నారు. కోవిడ్ బాధితుల నుంచి ప్రస్తుతం వసూలు చేస్తున్న సిటీ స్కానింగ్(high-resolution CT) రేటు రూ.5500 కాగా.. మంత్రి హరీశ్ రావు కోరిక మేరకు రూ.2000 మాత్రమే తీసుకుంటున్నట్టు సీటీ స్కానింగ్ కేంద్రాల నిర్వాహకుల సంఘం నేతలు తెలిపారు. కరోనా కష్ట కాలంలో సగానికి పైగా ఛార్జీలు తగ్గించిన సిద్దిపేట జిల్లా సిటీ స్కానింగ్ కేంద్రాల నిర్వాహకులకు మంత్రి హరీశ్ రావు అభినందనలు తెలిపారు.

కరోనా కష్ట కాలంలో లో కొవిడ్ చికిత్స పొందే పేద,మధ్య తరగతి బాధితులకు ప్రభుత్వం నిర్దేశించిన రేట్లకే చికిత్స అందించాలని జిల్లాలోని ప్రైవేట్ దవాఖానాలకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో కొవిడ్ దవాఖానాలుగా మారిన అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్.. బాధితులకు వెంటనే చికిత్స ప్రారంభించాలని సూచించారు. జిల్లాలో ఆక్సిజన్, రెమిడిసివర్ కొరత లేకుండా గట్టిగా కృషి చేస్తున్నామని మంత్రి తెలిపారు. కొవిడ్ బాధితులందరికీ చికిత్స అందించేందుకు ప్రైవేట్ దవాఖానాలకు ఉచితంగా ఆక్సిజన్ సప్లై చేస్తున్నామన్నారు. సాధ్యమైనంత త్వరగా సిద్దిపేట జిల్లాలో కొవిడ్ దవాఖానాల్లో ఆకస్మిక తనిఖీలు చేస్తానన్నారు. బాధితులతో స్వయంగా మాట్లాడి.. వారికి అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకుంటానని మంత్రి తెలిపారు. ఈ మేరకు ఆయన సిద్దిపేట జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.