తెలంగాణ విద్వత్సభ సిద్ధాంతుల కృషిని అభినందించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

తెలంగాణ విద్వత్సభ షష్ఠ వార్షిక సమ్మేళనం ఇటీవల వర్గల్ శ్రీ విద్యాసరస్వతి దేవాలయంలో జరిగింది. ఈ సమ్మేళనంలో తెలంగాణ విద్వత్సభకు సంబంధించిన వందమంది సిద్ధాంతులు, పంచాంగ కర్తలు, జ్యోతిష్య పండితులు చర్చించి నిర్ణయించిన రాబోయే శోభకృత నామ సంవత్సర పండగలను ఏకగ్రీవంగా నిర్ణయించి ఆ జాబితాను ఇవాళ రాష్ట్ర దేవదాయ, ధర్మదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ అధ్యక్షులు డాక్టర్ కేవీ రమణాచారిలకు అందజేశారు.

ఈ సందర్భంగా దేవదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సిద్ధాంతులను ఉద్దేశించి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో ఆరు సంవత్సరాలుగా సిద్ధాంతులందరూ ఒక వేదిక మీదకు వచ్చి తెలంగాణ విద్వత్సభ పేరుతో ప్రతి సంవత్సరము పండగలు నిర్ణయిస్తూ ప్రభుత్వానికి సహకరిస్తున్నారన్నారు. ప్రజల్లో పండగల పట్ల గందరగోళం అనుమానాలు లేకుండా వీరు సమష్టిగా చేస్తున్న నిర్ణయాలు ఎంతో ఉపకరిస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వపరంగా తెలంగాణ విద్వత్సభకు అన్ని విధాల సహాయ సహకారాలు అందజేస్తామని.. సిద్ధాంతుల కృషిని వారు అభినందించారు.

అనంతరం తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి మాట్లాడుతూ.. తెలంగాణ విద్వత్సభలో ఉన్న వరిష్ఠ సిద్ధాంతులు, పంచాంగకర్తలు సమన్వయంతో ప్రజలకు ప్రభుత్వానికి ఒక వారధి లాగా ప్రతి సంవత్సరము పండగలను లోతైన చర్చ ద్వారా శాస్త్ర గ్రంథాలను పరిశీలించి పండగలను నిర్ణయించడం ఎంతో ముదావహమన్నారు. ప్రతి సంవత్సరము విద్వత్సభ నిర్ణయించే పండగలను ప్రభుత్వ పక్షాన తాము ఉత్తర్వులను ఇస్తున్నామని విద్యుత్సభ చేస్తున్నటువంటి కృషి ప్రభుత్వానికి ఎంతో ఉపయోగపడుతుందని భవిష్యత్తులో కూడా విద్వత్సభ మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలని వారు ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ సభ్యులు విద్వత్సభ ముఖ్యులు బోర్భట్ల హనుమంతాచార్యులు, మరుమాముల వెంకటరమణ శర్మ, తెలంగాణ విద్వత్సభ కార్యదర్శి దివ్యజ్ఞాన సిద్ధాంతి, తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అధ్యక్షుడు వెన్నంపల్లి జగన్మోహన్ శర్మ, వేద, శాస్త్ర పండితులు శాస్త్రుల వెంకటేశ్వరశర్మ, కార్యదర్శి గాడిచర్ల నాగేశ్వర సిద్ధాంతి తదితరులు పండగల జాబితాను సమర్పించిన వారిలో ఉన్నారు.