సీఎం కేసీఆర్ అవకాశం ఇస్తేనే ఈటల స్థాయి పెరిగింది: మంత్రి కొప్పుల ఈశ్వర్

గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను సీఎం కేసీఆర్ ఆశీర్వదించి పంపిన ఉద్యమ బిడ్డ అని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. కరీంనగర్ జమ్మికుంట పట్టణంలోని హనుమాన్ టెంపుల్ నుండి గీతా మందిర్ వరకు గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో హుజురాబాద్ టిఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు మద్దతుగా సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. తర్వాత గీతా మందిర్ ఫంక్షన్ హాల్ లో జరిగిన సభలో మంత్రి కొప్పుల ఈశ్వర్ పాల్గొని మాట్లాడారు.

గతంలో ఏ ప్రభుత్వమైనా ప్రజలను, ప్రజల సమస్యలను పట్టించుకున్నాయా? తెలంగాణ వచ్చిన తర్వాత ఆత్మహత్యలు, వలసలు ఆగిపోయాయి. గ్రామాలు ఎలా అభివృద్ధి చెందాయో మీ కళ్ళ ముందు కనిపిస్తుంది. టిఆర్ఎస్ అంటేనే ప్రజలు.. ప్రజలు అంటేనే టిఆర్ఎస్. మీ మట్టిబిడ్డ గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలవాల్సిన అవసరం ఉందన్నారు.

కేసులు, లాఠీ దెబ్బలకు భయపడని బిడ్డ గెల్లు శ్రీనివాస్ యాదవ్. ఆనాడు సీఎం కెసిఆర్ అవకాశం ఇస్తేనే ఈటల స్థాయి పెరిగింది. ఒక ఎకరం అమ్మితే ఎన్నికల్లో గెలుస్తానన్న వ్యక్తి ఈటల రాజేందర్. అభ్యర్థి డబ్బులు ఇచ్చే పరిస్థితి నుంచి అభ్యర్థికి మీరు డబ్బులు ఇవ్వడం శుభపరిణామన్నారు.

చెరువుల్లో ఉచితంగా చేపలు వేసిన గొప్ప ప్రభుత్వం మాది. ఇవాళ ఆంధ్ర ప్రాంతానికి మన చేపలు ఎగుమతి అవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం చెప్పుకోదగ్గ ఒక్క పథకమైనా అమలు చేస్తుందా. వ్యక్తి కాదు.. వ్యవస్థ ముఖ్యం. ఈటల రాజేందర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడే ఏం చేయలేదు.. ఇప్పుడు గెలిస్తే ఏం చేస్తాడని మంత్రి కొప్పుల ప్రశ్నించారు.

ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో నీటి వనరులు పెరిగి.. మత్స్య సంపద పెరగడంతో వలసలు వెళ్ళినవారు తిరిగి వస్తున్నారన్నారు. ఈనాడు మన చెరువుల్లో 30-40 కిలోల చేపల పెరుగుతున్నాయి. మిషన్ కాకతీయతో చెరువుల అభివృద్ధి తర్వాత చేపల పెంపకం పెరిగింది. పైసా ఖర్చు లేకుండా సీఎం కేసీఆర్ చేప పిల్లలు ఇచ్చి.. పెంపకానికి ప్రొత్సాహం అందిస్తున్నారన్నారు. తెలంగాణ చేపలు మంచినీళ్లలో పెరుగుతున్నాయి.. ఇక్కడి చేపలు ఉన్నంత రుచి మరెక్కడా ఉండదు. బెస్త కులానికి చెందిన నన్ను సీఎం కేసీఆర్ ప్రోత్సాహించి ఎమ్మెల్యేగా చేశారు. వేరే పార్టీలకు డిపాజిట్లు కూడా రాకుండా గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.

ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాల బిడ్డకు సీఎం కేసీఆర్ టిక్కెట్ ఇచ్చారన్నారు. గంగపుత్రుల కోసం సీఎం కేసీఆర్ అనేక అవకాశాలు కల్పిస్తున్నారు. గంగపుత్రులు టిఆర్ఎస్ కు మద్దతు ఇవ్వడం శుభపరిణామం. రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు అవుతున్నాయి. భారతదేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇక్కడ సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయన్నారు.

హుజురాబాద్ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ బాటలో నడుస్తూ తెలంగాణ కోసం అనేక ఉద్యమాల్లో పాల్గొన్నాను. సీఎం కేసీఆర్ అభ్యర్థిగా నాకు అవకాశం ఇచ్చారు.. మీ బిడ్డగా గెలిపిస్తే తలలో నాలుకలా పనిచేస్త. తెలంగాణ రాకముందే బాగుండేది అని కొందరు అంటున్నారు. తెలంగాణ రాక ముందు మన బతుకులు ఎలా ఉన్నాయి.. ఇప్పుడు ఎలా ఉన్నాయి అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. తెలంగాణ వచ్చాక ఇచ్చిన మాట ప్రకారం సీఎం కేసీఆర్ లక్షా 30 వేల పైచిలుకు ఉద్యోగాలు ఇచ్చారు. కొత్త పారిశ్రామిక పాలసీతో అంతర్జాతీయ కంపెనీలు వచ్చాయి.. 15 లక్షల మందికి ఉపాధి అవకాశాలు దక్కాయి. తెలంగాణ రావడం కొంతమంది సంపన్నులకు నచ్చడం లేదు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం కేంద్ర సంస్థలను ప్రైవేటు పరం చేస్తున్నారు. ఉద్యమంలో ఎలాంటి కమిట్ మెంట్ తో పని చేశానో.. నాకు అవకాశం ఇస్తే అదే విధంగా పనిచేస్తానని గెల్లు శ్రీనివాస్ యాదవ్ అన్నారు.