మోడీ సర్కార్ తెలంగాణ నేతన్నల కడుపు కొడుతోంది

Minister KTR

తెలంగాణ టెక్స్ టైల్ రంగానికి కేంద్రం చేసిందేమి లేదన్నారు మంత్రి కేటీఆర్. టెక్స్ టైల్ రంగానికి కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన సహాయం,చేపట్టాల్సిన చర్యలపై కేంద్ర టెక్స్ టైల్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ కి మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. వ్యవసాయం తర్వాత అత్యధిక మంది దేశ ప్రజలకు ఉపాధి కల్పిస్తున్న టెక్స్ టైల్ రంగంపై మోడీ ప్రభుత్వానికి చిన్నచూపు, నిరాసక్తత ఉన్నదని తన లేఖలో కేటీఆర్ తెలిపారు. శుష్క వాగ్దానాలు–రిక్త హస్తాలు అన్నట్టుగా వ్యవహరిస్తున్న మోడీ సర్కార్ తెలంగాణ నేతన్నల కడుపు కొడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ టెక్స్ టైల్ రంగానికి సాయం చేశామంటూ ప్రధాని మోడీతో పాటు కేంద్ర మంత్రులు వల్లె వేసే అసత్యాలు మాని తెలంగాణ నేతన్నకు సహాయం చేస్తే మంచిదని హితవు పలికారు. నిజానికి తెలంగాణ టెక్స్ టైల్ రంగానికి, చేనేత కార్మికులకు కేంద్ర బీజేపీ ప్రభుత్వం నయా పైసా అదనపు సాయం చేయలేదని ఆ లేఖలో కేటీఆర్ విమర్శించారు.

వ్యవసాయం తర్వాత దేశంలో అత్యధిక ప్రజలకు ఉపాధి కల్పిస్తున్న టెక్స్ టైల్ రంగ ప్రస్తుత దుస్థితికి కేంద్ర ప్రభుత్వ మతిలేని విధానాలే కారణమని లేఖలో తెలిపారు మంత్రి కేటీఆర్ . తెలంగాణ టెక్స్ టైల్-చేనేత రంగానికి కేంద్ర ప్రభుత్వం నుంచి అందాల్సిన సహకారానికి సంబంధించిన వివరాలను తన లేఖలో కేటీఆర్ పొందుపరిచారు. నిధులు, నియామకాలు, నీళ్లతో పాటు నేతన్నల బాగు కోసం ఉద్యమించిన తాము, అధికారంలోకి వచ్చిన ఈ ఎనిమిదేండ్ల నుంచి టెక్స్ టైల్ రంగాన్ని ఆదుకోవాలని వివిధ రూపాల్లో కేంద్రాన్ని కోరామన్నారు. భారతీయ ఆత్మకు ప్రతీక అయిన ఎన్నో రంగాలను నిర్వీర్యం చేసినట్టుగానే మోడీ ప్రభుత్వం టెక్స్ టైల్-చేనేతరంగంపై కూడా కక్ష కట్టిందని కేటీఆర్ ఆరోపించారు. అందుకే ఆ రంగం బాగు కోసం ఏ మాత్రం ఆలోచింకుండా చేనేతపై జీఎస్టీ వంటి అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటు నేతన్నల పొట్టగొడుతోందని విమర్శించారు.

తెలంగాణకు వచ్చిన ప్రధాని మోడీ తన ప్రసంగంలో తెలిపిన మెగా టెక్స్ టైల్ పార్క్ ఎక్కడ ఉందో తెలంగాణ ప్రజలకు చెప్పాలని కేటీఆర్ తన లేఖలో డిమాండ్ చేశారు.  సూమారు 1552 కోట్ల రూపాయల తెలంగాణ ప్రభుత్వ నిధులతో మొదలుపెట్టిన కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ లో కేంద్రం తరుపున కనీసం మౌలిక సదుపాయాలను కల్పించాలని కోరితే.. ఇప్పటివరకు స్పందించని బీజేపీ ప్రభుత్వం మెగా టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటు గురించి మాట్లాడడం విడ్డూరమన్నారు.

రాష్ట్రంలోనే అత్యధిక పవర్ లూమ్ మగ్గాలు ఉన్న సిరిసిల్లలో మెగా పవర్ లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని కోరితే.. ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వం స్పందించలేదని కేటీఆర్ ఆరోపించారు.

జాతీయ చేనేత అభివృద్ధి కార్యక్రమం(NHDP)లో భాగంగా తెలంగాణలో 15 బ్లాక్ లెవెల్ హ్యాండ్లూమ్ క్లస్టర్ లను ఏర్పాటు చేయాలని చేసిన విజ్ఞప్తిని మోడీ సర్కార్ బుట్ట దాఖలు చేసిందని కేటీఆర్ ఆరోపించారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఖాదీ వస్త్రాలపై కూడా పన్ను విధించిన దుర్మార్గపు ప్రభుత్వం బీజేపీనే అన్నారు కేటీఆర్. జీఎస్టీతో పన్ను పోటుతో నేతన్నల నడ్డి విరుస్తున్న కేంద్ర అరాచక ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఉధృతంగా సాగుతున్న నిరసన కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకోనైనా టెక్స్ టైల్ ఉత్పత్తులపై జీఎస్టీ పన్ను తగ్గిండం,  ముఖ్యంగా చేనేత వస్త్రాలపై జీఎస్టీని పూర్తిగా మినహాయించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. దేశంలోని చేనేత కార్మికులపై కేంద్రానికి ప్రేమ ఉంటే ఈ అగస్టు 7తేదిన జరిగే జాతీయ చేనేత దినోత్సవం నాటికి ఈ జీఎస్టీ పన్నును  రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నోటి మాటలు కాదు-నిధుల మూటలు ఇవ్వండి, ప్రకటనలు కాదు, పథకాలు రావాలని… తెలంగాణ టెక్స్ టైల్, చేనేత రంగానికి ప్రోత్సాహం కావాలి అని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.