ఐదేండ్లు వర్షాలు రాకున్నా.. మంచినీటికి కొరత రాదు

  • 50 ఏండ్ల తర్వాత మనం ఉన్నా లేకున్నా.. మన పిల్లలు మాత్రం ఉంటారు
  • కేసీఆర్ విజన్ చాలా గొప్పది
  • ఇన్‌టెక్‌ వెల్‌ పంపింగ్ స్టేషన్ శంకుస్థాపనలో మంత్రి కేటీఆర్

హైదరాబాద్ నగరానికి తాగునీటి సరఫరా కోసం సుంకిశాల వద్ద ఏర్పాటు చేస్తున్న ఇన్‌టెక్‌ వెల్‌ పంపింగ్ స్టేషన్ కు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. అదేవిధంగా కోదందాపూర్ ట్రాన్స్మిషన్ పంపింగ్ స్టేషన్ నిర్మాణ పనులకు శంకస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, జగదీష్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, ఎమ్మెల్యే భాస్కర్ రావు, ఎమ్మెల్యే రవీంద్ర కుమార్, మండలి సభ్యులు రవీందర్ రావు, జలమండలి ఎండీ దాన కిషోర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు.

‘ఇది ఒక శుభదినం. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల ప్రజలకు నిజంగా ఇది చాలా మంచిరోజు. దేశవ్యాప్తంగా శరవేగంగా విస్తరిస్తున్న నగరాలలో హైదరాబాద్ ఒకటి. ఈ విషయం రాజకీయాలకతీతంగా అందరూ ఒప్పుకోవాల్సిందే. వచ్చే 15 సంవత్సరాలలో ఢిల్లీ తర్వాత రెండో అతిపెద్ద నగరంగా హైదరాబాద్ ఆవిష్కరిస్తోంది. ఇప్పటికే మనం ఎయిర్ ట్రాఫిక్‎లో నాల్గో స్థానంలో ఉన్నాం. ఏ నగరానికి లేని అనుకూలమైన భౌగోళిక పరిస్థితుల మనకు ఉన్నాయి. హైదారాబాద్ తెలంగాణకు రాజధాని మాత్రమే కాదు. హైదరాబాద్ లాంటి మహానగరం జాతి సంపద. అలాంటి నగరాన్ని భవిష్యత్తుకు సకల సౌకర్యాలతో అందించాలి. కేసీఆర్ నాయకత్వంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాం. నా చిన్నతనంలో హైదరాబాద్‎లో నీటి కోసం గొడవలు జరుగుతుండేవి. అందుకే సీఎం ముందు జాగ్రత్త చర్యగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ విశ్వనగరాల సరసన చేరాలనే ఆకాంక్షతో ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రస్తుతం నగరానికి 37 టీఎంసీల నీటి అవసరాలున్నాయి. అదే రాబోయే 50 ఏళ్లలో 2071 నాటికి 71 టీఎంసీల తాగునీరు హైదరాబాద్‎కు అవసరమవుతుంది. వచ్చే 50 ఏండ్ల తర్వాత మనం ఉంటామో లేదో కానీ నగరం, మన పిల్లలు మాత్రం ఉంటారు. వారికోసమే ఈ ప్రాజెక్టును రూ. 1450 కోట్ల రూపాయలతో చేపడుతున్నాం. భవిష్యత్తులో కృష్ణా ఫేజ్ 4, 5కు సంబంధించిన పనులు కూడా ఇప్పటి నుంచే చేస్తున్నాం. కాబట్టి హైదరాబాద్ ఎంత విస్తరించినా మంచినీటికి కొరత రాదు. వరుసగా ఐదేండ్లు వర్షాలు రాకున్నా.. మంచినీటి కొరత రాదు. ఈ ప్రాజెక్ట్ విషయాలు ప్రజలలోకి తీసుకెళ్లాలి. వదేండ్ల ముందుచూపున్న నాయకుడు ఒకవైపు.. వందరోజులు మాత్రమే చూసే నాయకులు మరోవైపు. కేసీఆర్ విజన్ అలా వదేండ్ల ముందు ఉంటుంది’ అని మంత్రి కేటీఆర్ తెలిపారు.

మంత్రి సబితా ఇంద్రా రెడ్డి
ఈ రోజు చరిత్రలో నిలిచిపోతుంది. గతంలో వారానికి ఒకసారి నీరు వచ్చేది. సీఎం కేసీఆర్ ప్రతి అంశానికి శాశ్వత పరిష్కారం చూపిస్తున్నారు. ఈ పాజెక్టుతో మంచి నీటికి శాశ్వత పరిష్కారం లభిస్తుంది. రీజినల్ రింగ్ రోడ్ వరకు నగరం విస్తరించినా మంచినీటికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. కేసీఆర్ నాయకత్వంలో హైదరాబాద్ పీస్‎ఫుల్ సిటీగా మారింది.

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
హైదరాబాద్ పాపులేషన్ రోజురోజుకూ పెరుగుతూపోతోంది. అదేవిధంగా అన్నిరంగాలలో కూడా అభివృద్ధి చెందుతోంది. దాంతో ఎక్కడెక్కడి నుంచో ఇక్కడకు వచ్చి స్థిరపడుతున్నారు. అటువంటి నగర ప్రజల దాహార్తిని తీర్చుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్‎కు జీవితాంతం రుణపడి ఉంటాం. హైదరాబాద్ నగరం మరింత విస్తరించినా తాగునీటికి ఎలాంటి ఇబ్బంది ఉండదు.