తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి.. ఫాక్స్ కాన్‌కు మంత్రి కేటీఆర్‌ ఆహ్వానం

హైదరాబాద్‌: తైవాన్‌కు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తుల తయారీ సంస్థ ఫాక్స్ కాన్‌ (హాన్‌ హై టెక్నాలజీ గ్రూప్‌) తెలంగాణలో పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నట్లు ప్రకటించింది. రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కే. తారక రామారావు గురువారం ఢిల్లీలో ఫాక్స్ కాన్‌ ఛైర్మన్‌ యంగ్‌ లియుతో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పారిశ్రామిక అనుకూల విధానాలు, ఎలక్ట్రానిక్స్‌ పరికరాల ఉత్పత్తిలో తెలంగాణలో ఉన్న అనుకూల పర్యావరణ వ్యవస్థలపై వివరించారు. తెలంగాణలో పరిశ్రమ ఏర్పాటు చేస్తే ప్రభుత్వం తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇస్తూ, అవకాశాలను తెలుసుకునేందుకు రాష్ట్రాన్ని సందర్శించాలని ఆయన ఫాక్స్ కాన్‌ ప్రతినిధి బృందాన్ని ఆహ్వానించారు.

ప్రపంచంలో ఎలక్ట్రాకిక్స్‌ తయారీలో అత్యధిక ఉద్యోగావకాశాలు కల్పిస్తున్న సంస్థల్లో ఫాక్స్ కాన్‌ ఒకటని, సదరు సంస్థ ఈవీల తయారీలో కూడా ప్రవేశించాలని నిర్ణయించడం సంతోషించదగ్గ విషయమని పేర్కొన్నారు. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్‌ రంగంలో పెట్టుబడులకు తెలంగాణ గమ్యస్థానంగా ఉందని, అత్యంత అధునాతన ఆర్‌ అండ్‌ డీ, ఆవిష్కరణల పర్యావరణ వ్యవస్థను కలిగి ఉందన్నారు.

ఈ సమావేశంలో ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, ఎలక్ట్రానిక్స్ డైరెక్టర్ సుజయ్ కరంపురి పాల్గొన్నారు.