అవార్డులు, ప్రశంసలు సరే.. నిధులు కూడా ఇవ్వండి

KTR

సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఏడేన్నరేళ్లుగా అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకెళుతున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. మాసబ్ ట్యాంక్ సీడీఎంఏ ఆఫీస్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. నగరాల అభివృద్ధికి కొత్త మున్సిపల్ చట్టం, పట్టణ ప్రగతి తెచ్చామన్నారు. ఇప్పుడు 142 మున్సిపాలిటీలు ఉన్నాయి. విధులే కాదు.. నిధుల విషయంలో కూడా క్రమం తప్పకుండా విడుదల అయ్యేలా చేశామని గుర్తు చేశారు.

మౌళికవసతులు కల్పనకు పెద్దపీట

కొత్త చట్టం తరువాత మున్సిపాలిటీలకు రూ.2,950 కోట్లు ఇప్పటివరకు నిధులు ఇచ్చాం. పార్కులు, మోడల్ మార్కెట్లు, మౌళికవసతులు కల్పనకు పెద్దపీట వేశాం. స్వచ్ఛ ఆటోలు, ఘన వ్యర్థాల నిర్వహణ చేపట్టాం. దేశంలో ఎక్కడాలేని విధంగా గ్రీన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టి హరిత పట్టణాలను తీర్చిదిద్దుతున్నామని కేటీఆర్ వివరించారు.

స్వచ్ఛ సర్వేక్షణ అవార్డుల్లో తెలంగాణ సత్తా

నిర్మాణ అనుమతులకు బీపాస్ చట్టాలు తెచ్చాం. పౌరుడు కేంద్రంగా, పౌర సేవలు లక్ష్యంగా కొత్త చట్టాలు తెచ్చాం. స్వచ్ఛ సర్వేక్షణ అవార్డుల్లో తెలంగాణ సత్తా చాటింది. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ నుంచి సమాచారం వచ్చింది. శానిటేషన్ ఛాలెంజ్ లో దేశంలోని అన్ని పట్టణాల్లో జరిగిన పోటీలో రాష్ట్రానికి 12 అవార్డులు వచ్చాయి. ఈ నెల 20న స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులు ఢిల్లీలో అందిస్తారు.. ఇది తెలంగాణకు గర్వకారణం అన్నారు.

పట్టణ ప్రగతితోనే సాధ్యమైంది

జాతీయ స్థాయిలో రాష్ట్రాలకు ఇచ్చే అవార్డుల్లో తెలంగాణకు పురస్కారం దక్కింది. సఫాయి మిత్ర సురక్ష ఛాలెంజ్ లో తొలిసారి రాష్ట్రానికి వచ్చింది. టాప్ 3 టౌన్స్ లో కరీంనగర్ కు అవార్డు వచ్చింది. గార్బేజ్ ఫ్రీ సిటీ కింద గ్రేటర్ హైదరాబాద్ ను గుర్తించారు. గ్రేటర్ హైదరాబాద్ కు స్వచ్ఛ సర్వేక్షణ అవార్డు వచ్చింది. అవార్డులు దక్కించుకున్న మున్సిపాలిటీలకు అధికారులకు అభినందనలు, శుభాకాంక్షలు. పట్టణ ప్రగతి కార్యక్రమానికి ఈ మొత్తం ఘనత దక్కుతుందని చెప్పారు.

ప్రజల సహకారంతో అగ్రస్థానం

142 మొత్తం మున్సిపాలిటీలకు ఓడిఎఫ్ గుర్తింపు, 101 మున్సిపాలిటీలకు ఓడిఎఫ్ ప్లస్ గా గుర్తింపు. ఓడిఎఫ్ ప్లస్ ప్లస్ 8 మున్సిపాలిటీలకు గుర్తింపు. వాటర్ ప్లస్ సిటీగా హైదరాబాద్ ను ఇప్పటికే గుర్తించింది. స్ట్రీట్ వెండర్స్ కి లోన్ ఇవ్వడంలో తెలంగాణ నెంబర్ వన్ గా నిలిచింది. ప్రణాళికబద్ధ కార్యక్రమాలు, ప్రజల సహకారంతో అగ్రస్థానం దక్కింది. అవార్డుల ప్రదానోత్సవంలో మున్సిపల్ శాఖ తరపున అందరం పాల్గొంటామని కేటీఆర్ చెప్పారు.

 రూ.18 వేల కోట్లతో డబుల్ బెడ్రూం ఇండ్లు

పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి ఏక కాలంలో జరగడం అరుదు. రూ.18 వేల కోట్లతో డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టిస్తున్న రాష్ట్రం తెలంగాణ. మేము కట్టిస్తున్న ఒక్కో డబుల్ బెడ్రూం ఇల్లు 10 ఇందిరమ్మ ఇండ్లతో సమానం. రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో నిధుల కొరత లేదు. మున్సిపల్ కార్మికులకు టంఛనుగా జీతాలు ఇస్తున్నాం. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణంలోనూ అచీవ్ మెంట్ సాధించాం. త్వరలో మీడియా సమావేశం పెట్టి ప్రకటిస్తామన్నారు.

వరద నీటిపై ప్రణాళికలు

హైదరాబాద్ లో వర్షం వచ్చినప్పుడు వరద నీటిపై కూడా ప్రణాళికలు చేస్తున్నాం. నగరంలో రెండు కాలనీల్లో నీళ్లు ఉంటే హైదరాబాద్ మొత్తం మునిగిపోయిందని వార్తలు వేయడం సరికాదు. వరద పరిస్థితిని మెరుగుపరుస్తున్నాం. ప్రజల ఫీడ్ బ్యాక్ ఆధారంగా కొన్ని కార్యక్రమాలు చేపడుతున్నాం. ట్యాంక్ బండ్ పై సన్ డే ఫన్ డే, చార్మినార్ దగ్గర ఏక్ శ్యామ్ చార్మినార్ కే నామ్ కార్యక్రమం వంటివి చేపట్టామన్నారు.

అదనంగా ఒక్క రూపాయి కూడా కేంద్రం ఇవ్వట్లే

కంటోన్మెంట్ లో అభివృద్ధికి కేంద్రానికి విజ్ఞప్తులు చేస్తూనే ఉన్నాం. హైదరాబాద్ అభివృద్ధి విషయంలో కేంద్రం మా పలు విజ్ఞప్తులను బుట్ట దాఖలు చేసింది. కేంద్రం నుంచి అవార్డులు, ప్రసంశలు ఇస్తున్నారు కానీ నిధులు రావట్లే. అదనంగా ఒక్క రూపాయి కూడా కేంద్రం ఇవ్వట్లే. మాకు రావాల్సినవి నిధులు రాకుంటే మేం రోడ్ల మీదకు వచ్చి ఆందోళన చేయాల్సిందేనని కేటీఆర్ స్పష్టం చేశారు.