Tuesday, April 23, 2024

మహబూబ్ నగర్ లో ఐటీ టవర్ ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

spot_img

గ్రామీణ ప్రాంత యువతకు ఉపాది కల్పన లక్ష్యంతో ఐటీ టవర్ లను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని టైర్-2 పట్టణాలకు ఐటీ రంగాన్ని విస్తరించే లక్ష్యంలో భాగంగా మహబూబ్‌నగర్‌లో ఐటీ టవర్‌ను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు, మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి ప్రారంభించారు. శంషాబాద్‌ విమానాశ్రయానికి దగ్గర్లో ఉన్న మహబూబ్ నగర్ లో కార్యకలాపాలను ప్రారంభించేందుకు ఐటీ కంపెనీలు ఆసక్తిని కనబరుస్తాయన్న నమ్మకాన్ని ఈ సందర్భంగా కేటీఆర్ వ్యక్తం చేశారు.

మహబూబ్‌నగర్‌లోని ఈ ఐటీ టవర్ నాలుగు ఎకరాల విస్తీర్ణంలో జి ప్లస్ 4 అంతస్తుల్లో నిర్మించబడింది. 44 కంపెనీలు కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చు. ఇందుకు అనుగుణంగా పది కాన్ఫరెన్స్ హాళ్లు, ఓ ఇన్నోవేషన్ సెంటర్, నాలెడ్జ్ హబ్ తో పాటు ఆధునిక కెఫెటేరియా ఉన్నాయి.

ఈ సందర్భంగా తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) సెంటర్, టి-హబ్, వీ హబ్ ఫెసిలిటేషన్ సెంటర్‌లను కేటీఆర్ ప్రారంభించారు. ముల్లర్ డాట్‌కనెక్ట్, అమర రాజా గ్రూప్, జువెన్ టెక్నాలజీస్, ఇంటూట్స్ ఎల్‌ఎల్‌సి, ఉర్పాన్ టెక్నాలజీస్, ఇ-గ్రోవ్ సిస్టమ్స్, ఐటి విజన్ 360 ఇంక్, ఫోర్ ఓక్స్ ఇంక్ తో పాటు బిసిడిసి క్లౌడ్ సెంటర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు ఇక్కడ పనిచేసేందుకు అవసరమైన అనుమతి పత్రాలను అందజేశారు.

రాష్ట్రవ్యాప్తంగా ఐటీ వృద్ధిని విస్తరించాలనే లక్ష్యంతో వరంగల్, కరీంనగర్, ఖమ్మంతో పాటు మహబూబ్‌నగర్‌ లో ఐటీ టవర్ ను బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మరికొద్ది నెలల్లో నిజామాబాద్, నల్గొండ, సిద్దిపేటలో ఐటీ టవర్లను ప్రారంభించబోతుంది. కొన్ని నెలల క్రితం ఆదిలాబాద్‌లో ప్రారంభించిన ఐటీ టవర్‌ తో అద్బుతమైన ఫలితాలు వస్తున్నాయి. ప్రభుత్వం ఏర్పాటుచేస్తున్న ఈ ఐటీ టవర్లతో గ్రామీణ ప్రాంతాల్లోని యువతకు ఉపాధి అవకాశాలు దొరకడంతో పాటు అపారమైన వ్యాపార, వాణిజ్య అవకాశాలు ఏర్పడుతాయి.

Latest News

More Articles