ప్రజలు పండుగలను గొప్పగా జరుపుకోవాలి.. ఇదే ముఖ్యమంత్రి కేసీఆర్ అభిమతం

హైదరాబాద్ :  చిన్న దేవాలయాలకు కూడా ఆర్ధిక సహాయం అందించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దే అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. అబిడ్స్ బొగ్గుల కుంటలోని  దేవాదాయ శాఖ ప్రధాన కార్యాలయంలో 309 దేవాలయాలకు కోటి 3 లక్షల రూపాయల విలువైన  బోనాల చెక్కులను మంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్సీ ప్రభాకర్ రావు, ఎమ్మెల్యే రాజసింగ్ లతో కలిసి పంపిణీ చేశారు.

తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పే బోనాల ఉత్సవాలను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుందని మంత్రి తలసాని ఈ సందర్భంగా తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ 3500 కు పైగా దేవాలయాలకు ఆర్థిక సహాయం అందిస్తుందన్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ సాంస్కృతిక పండుగ అయిన బోనాల పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించాలని ప్రజలు కోరిన పాటించుకోలేదని చెప్పారు. రాష్ట్రం ఏర్పడిన వెంటనే బోనాల పండుగను ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర పండుగగా ప్రకటించి ఆలయాల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారు అని తెలియజేశారు. ప్రజలు పండుగలను గొప్పగా జరుపుకోవాలి అనేది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన అని చెప్పారు. ప్రజలందరూ సంతోషంగా హైద్రాబాద్ బోనాలను ఘనంగా జరుపుకోవాలని, మంత్రి తలసాని శుభాకాంక్షలు తెలియజేశారు.