ఈనెల 9 నుండి 22వర‌కు స్వ‌తంత్ర భార‌త వ‌జ్రోత్స‌వ వేడుక‌లు

Minister Talasani Srinivas Yadav

స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలను ఈనెల (ఆగస్టు) 9 నుండి 22వ తేదీ వరకు అత్యంత ఘనంగా నిర్వహించేలా తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందని  తెలిపారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఇవాళ(శుక్రవారం) మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో ఫిలిం డెవలప్మెంట్ శాఖ అధికారులు, ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు తదితరులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడారు. దేశానికి స్వాత్రంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వజ్రోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నాం. ఈ వేడుకల్లో విద్యార్ధులు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, యువతీ యువకులు ప్రతి ఒక్కరినీ భాగస్వాములను చేసే విధంగా ఎంతో ఉత్సాహంగా పాల్గొనేలా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఆగస్టు 15వ తేదీన ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసేలా ఇంటికో జెండాను అందజేయనున్నట్లు చెప్పారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. అందులో భాగంగా విద్యార్ధులంద‌రికీ మహాత్మాగాంధీ చరిత్రను తెలియజెప్పే, విద్యార్ధి దశ నుండే దేశభక్తిని పెంపొందించే విధంగా తెలుగు, హిందీ భాషల్లో రూపొందించిన చిత్రాన్ని రాష్ట్రంలోని 2.77 లక్షల సీట్ల సామర్ద్యంతో ఉన్న 563 స్క్రీన్ల‌లో ప్రదర్శించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. విద్యార్ధులను థియేటర్ లకు తీసుకెళ్ళే రవాణా ఏర్పాట్లను కూడా ప్రభుత్వం చేపడుతుందన్నారు. అంతేకాదు.. వారికి ఉచితంగా వాటర్ బాటిల్స్, స్నాక్స్ అందించడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా విద్యాశాఖ అధికారులతో ఒక సమావేశం నిర్వహించి సమీక్షించాలని హోంశాఖ ప్రిన్సిప‌ల్ సెక్రెటరీ రావిగుప్తా ను మంత్రి ఆదేశించారు.